జమ్ముకశ్మీర్ భారత్ అంతర్భాగమని, ఇకపై ఏదైనా అంశంపై చర్చించాలంటే అది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించే అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న టీఎస్ తిరుమూర్తి అన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాక్‌తో భారత్ సత్సంబంధాలు, అఫ్గాన్ అంశాలపై కూడా చర్చించారు తిరుమూర్తి.
ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత్ చేపట్టిన నేపథ్యంలో.. తీరప్రాంత భద్రత, ఉగ్రవాద నిరోధం, శాంతి పరిరక్షణ మొదలైన కీలక అంశాలపై సంతకాలు చేయనున్నట్లు తిరుమూర్తి తెలిపారు.
జమ్ముకశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసిన తిరుమూర్తి.. భద్రతా మండలి సభ్యులు కూడా ఈ అంశంపై చర్చించేందుకు అసమ్మతి చూపారని అన్నారు.
"పాకిస్థాన్‌తో సత్సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. భారత్- పాక్ మధ్య ఏవైనా సమస్యలుంటే.. ద్వైపాక్షిక, శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలి."
--టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి.
అఫ్గాన్ పరిస్థితి ఆందోళనకరం..
అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని తిరుమూర్తి పేర్కొన్నారు. అక్కడ హింస రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. ఉగ్రవాద స్థావరాలు భారత్‌లో లేవన్న ఆయన.. అఫ్గాన్ పరిస్థితుల ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్‌ను.. స్వతంత్రంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య దేశంగా చూడాలని భారత్ ఆశిస్తోందని అన్నారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. ఆగస్టు నెల మొత్తం భారత్ ఈ పదవిలో కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తిరుమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.