శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ 'పీఏ'కు కొవిడ్ సోకింది. ఈ మేరకు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే.. 2 నెలలుగా ఆ పీఏ ఇవాంకాకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సంబంధిత కార్యకలాపాలు చూస్తున్నట్లు సమాచారం.
ఇవాంకాకు కరోనా లక్షణాలు ఏమీ లేవని ఓ అధికారి తెలిపారు. ఇవాంక, ఆమె భర్త జారెడ్ కుష్నర్కు శుక్రవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో నెగటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు.
మూడో కేసు...
ఈ కేసుతో అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. ఉపాధ్యక్షుడు పెన్స్ ప్రెస్ సెక్రటరీకి శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతకుముందు.. వైట్‌హౌస్‌లో పనిచేసే సైనిక అధికారికి కరోనా సోకింది. ఇదే వైట్‌హౌస్‌లో తొలి కేసు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ట్రంప్, పెన్స్‌లకు కొవిడ్ పరీక్షలు చేయగా వారిగి నెగటివ్‌గా తేలింది. అప్పటినుంచి ఇరువురికీ రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైట్‌హౌస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
మాస్కుల్లేకుండానే..
అధ్యక్షుడి భద్రత విషయమై ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు శ్వేతసౌధం అధికారులు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వైట్‌హౌస్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మాస్కులు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం నిబంధన పాటించడం తప్పనిసరి చేశారు.
అయితే.. వైట్‌హౌస్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న పెన్స్ ఇటీవల ఓ సమీక్షకు మాస్కు లేకుండా హాజరవడం విమర్శలకు కారణమైంది. అధ్యక్షుడు ట్రంప్ కూడా వివిధ కార్యక్రమాలకు మాస్కు ధరించకుండానే హాజరవుతున్నారు.