'దేవుడు మనుషులను ప్రేమించడానికి.. వస్తువులను వాడుకోవడానికి సృష్టించాడు' ఇదో సినిమా డైలాగ్. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు దీని అర్థాన్నే మార్చేస్తున్నాయి! అపాయం నుంచి తోటి మనుషులే కాదు.. పరికరాలూ ప్రాణాలను కాపాడుతాయని నిరూపిస్తున్నాయి.
సింగపూర్లో ప్రమాదానికి గురైన ఓ యువకుడి ప్రాణాలను యాపిల్ స్మార్ట్ వాచ్ రక్షించగా.. ఇప్పుడు యాపిల్ ఐప్యాడ్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదం నుంచి తండ్రీకూతురును కాపాడింది.
పెన్సిల్వేనియాకు చెందిన 58 ఏళ్ల మాజీ పైలట్ తన కుమార్తెతో కలిసి సింగిల్-ఇంజిన్ సెస్నా 150 విమానంలో బయలుదేరారు. విల్కేస్-బారే స్క్రాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్దిసేపటికే రాడార్‌లో కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ సిబ్బంది విమానం చివరిసారిగా అదృశ్యమైన ప్రదేశంలో కోఆర్డినేటర్లు, వాలంటీర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
అతికష్టం మీద పైలట్ జాడ గుర్తించిన రెస్క్యూ బృందం.. అతని భార్యను సంప్రదించింది. బాధితుడి ఫోన్ నెంబర్‌ను సేకరించింది. కానీ బాధితుడికి ఫోన్ చేయగా.. ఆ ఫోన్కు సిగ్నల్స్ లేనట్లు తెలిసింది. అయితే అతడి కుమార్తె వద్ద ఐప్యాడ్ ఉన్నట్లు తెలుసుకుని.. దాని సిగ్నల్స్ ఆధారంగా జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తండ్రి, కూతురును అధికారులు కనిపెట్టారు. విమానం టేకాఫ్ అయిన ప్రాంతానికి కొద్ది దూరంలోని అటవీ ప్రాంతంలో చెట్ల మధ్య చిక్కుకున్నట్లు గుర్తించారు.
తీవ్రంగా గాయపడ్డ బాధితులిద్దరిని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులు.. ఐప్యాడ్ వల్ల వారిద్దరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: నచ్చిన సంగీతం వింటే మెదడుకు ఎంతో హాయి!