జూన్ 1నుంచి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య పెరగనుందని బ్లూమ్‌బెర్గ్ ప్రజారోగ్య విద్యాసంస్థ తయారుచేసిన అంతర్గత నివేదిక అంచనా వేసింది. రోజుకు 3,000 మంది మృతులు, 2,00,000 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అమెరికాలోని 24 రాష్ట్రాల్లో.. ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వివిధ దశల్లో ఉన్న వేళ.. కేసులు, మరణాలు పెరుగుతాయన్న నివేదిక అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన నిరుద్యోగం..
వైరస్ ప్రభావం అమెరికాలో అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 12 లక్షలమంది వైరస్ బాధితులు ఉండగా.. 69,000 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించింది. మూడు కోట్లమంది అమెరికన్లు నిరుద్యోగం వల్ల వచ్చే ప్రయోజాల కోసం దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది.
అమెరికాలోని రాష్ట్రాలు ఇప్పటికే గత ఏడు వారాలుగా మూసివేతలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కార్యకలాపాలను పునఃప్రారంభిస్తే పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారవచ్చనిని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది.
నివేదికపై అనుమానాలు..
జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రజారోగ్య విభాగానికి చెందిన ఎపిడెమాలజీ ప్రొఫెసర్ జస్టిన్ లెస్లర్ తయారుచేసిన ఈ నివేదికను.. అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ), శ్వేతసౌధం తోసిపుచ్చాయి.
ఈ నివేదిక బయటకు పొక్కడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు జస్టిన్. ఇది వార్తా సంస్థలకు ఏ విధంగా అందిందో తనకు తెలియని చెప్పారు. త్వరలో ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వెల్లడించారు.
శ్వేతసౌధం ప్రకటన
నివేదికపై స్పందించారు శ్వేతసౌధ అధికార ప్రతినిధి జడ్ డీర్. ఇది అధికారిక పత్రం కాదని.. కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌కు సమర్పించడం జరగలేదని పేర్కొన్నారు. కనీసం సమగ్ర పరిశీలన కూడా జరగలేదని పేర్కొన్నారు. కరోనా టాస్క్‌ఫోర్స్ ఉపయోగించే విధానాలను పాటించలేదని తెలిపారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సలహా అనంతరమే ఆర్థిక వ్యవస్థను పునః ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
అమెరికాలో ఇప్పటికే 12 రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయగా.. మరో 12 రాష్ట్రాలు నిబంధనల సడలింపునకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఇదీ చూడండి: 'కొన్ని రాష్ట్రాల తప్పుడు లెక్కలతోనే ఈ పెరుగుదల'