కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రత్యక్ష ప్రభావాల్లో అసమానత ఒకటని తెలిపారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్. అణగారిన వర్గాల్లో ఈ సమస్య అత్యంత తీవ్రంగా పెరిగిందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జీవా, అమెరికా ట్రెజరీ మంత్రి జెనెట్ యెలెన్లతో చర్చల్లో భాగంగా మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ప్రస్తుతం వాతావరణ మార్పులు, హింస, అసమానత, పేదరికం ప్రధాన సమస్యలుగా మారాయని పేర్కొన్నారు.
"కరోనా కారణంగా ప్రపంచంలో అసమానతలు పెరిగాయి. అవి కేవలం టీకా పంపిణీకి పరిమితం కాలేదు. ఆర్థికంగా కూడా అసమానతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పేద దేశాల ప్రజలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. వీటిని పరిష్కరించేందుకు ప్రపంచ బ్యాంక్ తన వంతు కృషి చేస్తోంది. ఇందుకోసం.. రుణ సేవల్లో సంస్కరణలు తీసుకువచ్చాం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం."
-డేవిడ్ మల్పాస్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు
అదే ప్రధాన సమస్య..
సేవా రంగంలో పనిచేసే వారు, మైనారిటీలు మహమ్మారి కారణంగా ఆరోగ్యం, ఆర్థికం.. రెండు అంశాల్లో నష్టపోయారని అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ తెలిపారు. వారిని ఆదుకునే దిశగా బైడెన్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అడ్డంకిగా మారుతోందని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఐఎంఎఫ్ అడుగులు వేస్తోందని ఆ సంస్థ ఎండీ జార్జీవా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'అఫ్గాన్ ఘర్షణల్లో 59 మంది మృతి'