సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అన్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి ఉపయోగిస్తున్నారని ప్రశంసించారు.
గురువారం సాయంత్రం డిస్కవరీ ప్లస్‌లో టెలికాస్ట్ చేసే 'కొవిడ్-19: వైరస్‌పై భారత్ పోరు' డాక్యుమెంటరీలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు గేట్స్. అత్యధిక జనాభా, పెద్దదేశం, పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువ కాబట్టి భారత్ అతిపెద్ద ఆరోగ్య సవాల్‌ను ఎదుర్కొంటోందని అన్నారు. 'భారత్‌లో చాలా సామర్థ్యం ఉంది. అక్కడి డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ప్రపంచమంతటికీ వ్యాక్సిన్లు సరఫరా చేయగలవు. చాలా వ్యాక్సిన్లు భారత్‌లోనే తయారవుతాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చాలా పెద్దది' అని దేశీయ ఫార్మా పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు బిల్ గేట్స్.
'భారత్‌లో బయో ఈ, భారత్ బయోటెక్ కూడా ఉన్నాయి. వారు కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందిస్తున్నారు. అక్కడి ఫార్మా పరిశ్రమ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసి మనందరి రోగ నిరోధక శక్తి పెంచగలదు. అలాగైతేనే మహమ్మారి అంతం అవుతుంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. అయితే కట్టడి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. తమ అవసరాల కోసం ప్రజలు బయటకు వస్తున్నప్పటికీ వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి' అని గేట్స్ తెలిపారు.