అధికారుల కళ్లు గప్పి 3 నెలలు ఎయిర్‌పోర్ట్‌లో తలదాచుకున్న భారత సంతతి వ్యక్తిని అమెరికా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతడు ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదని స్పష్టం చేశారు కుక్ కౌంటీ జడ్జి ఆడ్రియెన్ డేవిస్.
అసలేం జరిగిందంటే..
37 ఏళ్ల ఆదిత్య సింగ్ భారత సంతతి వ్యక్తి. మాస్టర్స్ డిగ్రీ కోర్సు చేసేందుకు.. అమెరికాకు ఆరేళ్ల క్రితం వెళ్లారు. లాస్ ఏంజెలెస్‌లో నివాసం ఉన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో.. 2020 అక్టోబర్ 19న భారత్ వెళ్లాలని నిశ్చయించుకొని షికాగోలోని ఓ'హేర్ విమానాశ్రయానికి బయల్దేరారు. కానీ.. కరోనా భయంతో ఎటూ వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.
సెక్యూరిటీ కెమెరాలకు చిక్కకుండా అక్కడి సెక్యూర్డ్ ఏరియాలోనే 3 నెలలు అనధికారికంగా నివసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుర్తింపు కార్డును చూపించమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడిగినప్పుడు అసలు విషయం బయటపడింది. దీంతో అతడ్ని జనవరి 16న అరెస్టు చేశారు. గుర్తింపు అడిగిన సిబ్బందికి తన దగ్గరున్న బ్యాడ్జ్ చూపించారు. అయితే ఆ బ్యాడ్జ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ మేనేజర్‌ది. అది పోయినట్టుగా అక్టోబర్‌లోనే సదరు మేనేజర్ ఫిర్యాదు చేశారు.
విమానాశ్రయ నిషేధిత ప్రాంతంలో అక్రమ చొరబాటు సహా విమానాశ్రయంలో దొంగతనం చేసినట్లుగా సింగ్‌పై అభియోగాలు మోపారు. వెంటనే దీనిపై దర్యాప్తునకు ఉపక్రమించింది ఎయిర్పోర్ట్ భద్రతా విభాగం. అయితే సింగ్ నిషేధిత ప్రాంతంలో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. విమానాశ్రయ నిబంధనలు కూడా ఉల్లంఘించలేదని తేలింది.
ఇప్పుడు కోర్టు కూడా అతడిని నిర్దోషిగా ప్రకటించింది.
ఇవీ చూడండి: Third wave: పొంచి ఉన్న మూడో దశ.. కొన్ని దేశాల్లో పెరుగుతున్న కేసులు