వచ్చే ఏడాది జనవరి 20న జరగనున్న తన ప్రమాణస్వీకార మహోత్సవాన్ని పర్యవేక్షించేందుకు నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. ఈ పీఐసీ (ప్రెసిడెన్షియల్ ఇనాగరల్ కమిటీ)లో భారతీయ-అమెరికన్ మజు వర్గీస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ పదవిని అందించారు.
ఇదే బృందంలో టోనీ ఆలెన్(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఎరిన్ విల్సన్(డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్), వాన్న కాన్సెల(డిబ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్)లు ఉన్నారు.
తనకు ఈ బాధ్యతలు దక్కడం గౌరవంగా ఉందన్నారు వర్గీస్.
"అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్, ఉపాధ్యక్ష ఎన్నిక విజేత కమలా హారిస్ ప్రమాణస్వీకార వేడుకలను దగ్గరుండి ఏర్పాట్లు చేయడం ఎంతో గౌరవంగా ఉంది. ఓవైపు అమెరికన్ల ఆరోగ్యం, భద్రత రక్షణ పట్ల వారికున్న నిబద్ధతను దృష్టిలో పెట్టుకునే.. దేశ శక్తిని చాటి చెప్పేందుకు ఇది ఓ మంచి వేదిక."
--- మజు వర్గీస్, పీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్.
బైడెన్ ప్రైమరీస్‌లో మజు వర్గీస్.. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ సలహాదారుగానూ సేవలందించారు. ఆ సమయంలో రోజువారీ ప్రచారాల కార్యకలాపాలను దగ్గరుండి చూసుకున్నారు వర్గీస్.
ఇదీ చూడండి:- 'నా బృందంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు'