భారతీయ- అమెరికన్ చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్ కశ్మీర్‌పై ఓ తీర్మానాన్ని యూఎస్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. కశ్మీర్ నివాసితుల మత స్వేచ్ఛను కాపాడాలని, సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, అంతర్జాలాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆమె భారత్‌ను కోరారు.
జయపాల్ చాలా వారాలపాటు ప్రయత్నించి చివరకు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానికి, కాన్సాస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు స్టీవ్ వాట్కిన్స్ మాత్రమే మద్దతుగా నిలిచారు. అయితే ఇది ఓ సాధారణ తీర్మానం. దీనిపై ఛాంబర్, సెనెట్ల్లో ఓటింగ్ జరగదు. కనుక చట్టంగా రూపొందే అవకాశం లేదు.
తీవ్ర వ్యతిరేకత
జయపాల్ 'కశ్మీర్' తీర్మానం ప్రవేశపెట్టే ముందు, యూఎస్‌లోని భారతీయ- అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆమె కార్యాలయం ముందు కొంతమంది శాంతియుత ప్రదర్శన చేశారు. అలాగే యూఎస్ కాంగ్రెస్‌లో ఈ తీర్మానం ప్రవేశపెట్టకూడదంటూ ఆమెకు 25 వేలకుపైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు సమాచారం.
భద్రతా సవాళ్లు ఉన్నా...
జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఎదుర్కొంటున్న భయంకరమైన భద్రతా సవాళ్లను, సరిహద్దుల్లో పొంచివున్న నిరంతర ఉగ్రవాద ముప్పునూ... జయపాల్ తన తీర్మానంలో పేర్కొన్నారు. అయినప్పటికీ శాంతియుత నిరసనలు చేపడుతున్నవారిపై బెదిరింపులు, బలప్రయోగం మానుకోవాలని కోరారు.
భారత్ ఒత్తిడి చేస్తోంది..
ఏకపక్షంగా నిర్బంధించిన రాజకీయనాయకులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని, వారిపై ఉన్న ఆంక్షలు కూడా తొలగించాలని జయపాల్ కోరారు. నిర్బంధంలోని వ్యక్తులు రాజకీయ ప్రకటనలు చేయకుండా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూచీకత్తు బాండ్లపై సంతకం చేయమని సర్కారు ఒత్తిడి చేస్తోందని ఆమె ఆరోపించారు. ఇందుకు ఆధారంగా తమ వద్ద కొన్ని ఫొటోగ్రాఫ్‌లు ఉన్నాయని ఆమె తెలిపారు.
ఖండించిన భారత్
ప్రమీలా జయపాల్ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత అంతర్గత విషయమని తేల్చిచెప్పింది. ఈ చర్య కశ్మీర్లో శాశ్వత శాంతికి పునాది వేసిందని పేర్కొంది.
ఇదీ చూడండి: దిల్లీ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశం.. పరిహారం ప్రకటన