అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఓ మహిళ లాటరీ తగల్లేదని పరధ్యానంగా దుకాణంలోని చెత్తకుండీలో పడేసిన టికెట్ మిలియన్ డాలర్లు(రూ.7.27కోట్లు) గెలుచుకుంది. ఆ దుకాణం నిర్వహిస్తున్న ఓ భారతీయ కుటుంబం ఈ విషయం గమనించి దీర్ఘకాలంగా తమ వినియోగదారుగా ఉన్న ఆమెకు టికెట్‌ను తిరిగి అప్పగించి అందరి మనసులు గెలుచుకొంది. మాసాచుసెట్స్ రాష్ట్రంలోని సౌత్విక్ పట్టణంలో ఓ భారతీయ కుటుంబం 'లక్కీ స్టాప్' పేరిట దుకాణం నిర్వహిస్తోంది.
ఈ దుకాణానికి తరచూ వచ్చే లీ రోజ్ ఫిగా అనే స్థానిక మహిళ గత మార్చిలో వారి వద్ద డైమండ్ మిలియన్స్ స్క్రాచ్-ఆఫ్ లాటరీ కొన్నారు. లాటరీ ఫలితాన్ని చూసుకునేందుకు ఇటీవల దుకాణానికి వచ్చిన లీ రోజ్ ఫిగా పరధ్యానంలో టికెట్ స్క్రాచ్ చేసి చూసింది.
రూ.7కోట్లు చెత్తకుండీలోకి!..
'మధ్యాహ్న భోజన విరామంలో దుకాణానికి వెళ్లా. సమయం తక్కువగా ఉండటంతో.. పైపైన గీకి చూసి లాటరీ తగల్లేదులే అంటూ టికెట్‌ను అక్కడే పడేసి వచ్చేశా' అని ఆమె తెలిపింది. అక్కడే చెత్తలో పదిరోజుల పాటు పడున్న ఆ టికెట్ దుకాణ యజమాని అభి షా కంటపడింది. పూర్తిగా స్క్రాచ్ చేయకుండా ఉన్న దాన్ని గీకి చూసిన అభి అవాక్కయ్యాడు. ఆ టికెట్ మిలియన్ అమెరికన్ డాలర్లు గెలుచుకుంది.!
భారతీయ ఉదారత..
తన తల్లి అరుణా షా విక్రయించిన ఆ టికెట్ చేత పట్టుకున్న అభి 'నేను మిలియనీర్' అంటూ కాసేపు కలల్లో తేలిపోయాడు. ఖరీదైన టెస్లా కారు కొందామని అనుకున్నాడు. 'రెండు రాత్రులు మా కుటుంబానికి నిద్ర లేదు' అని దుకాణ యజమాని మౌనిశ్ షా తెలిపారు. ఇండియాలో ఉంటున్న తాతయ్య, నానమ్మలకు అభి పోన్ చేసి విషయం చెప్పాడు. 'ఆ డబ్బు మనకు అక్కర్లేదు. టికెట్ ఎవరు కొన్నారో వాళ్లకు ఇచ్చేయండి' అని వాళ్లు నిష్కర్షగా చెప్పారు. మారు మాట్లాడకుండా ఆ టికెట్‌ను విజేతకు అప్పగించాలని మౌనిశ్ షా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ విషయం లీ రోజ్ ఫిగాకు చెప్పగానే.. ఆమె కాసేపు నమ్మలేదు. తర్వాత షా కుటుంబాన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఇపుడు అభి కుటుంబాన్ని ప్రశంసిస్తూ ప్రతిరోజూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. 'ఆ టికెట్ మా దగ్గరే ఉంచుకుని ఉంటే.. ఈ ఆనందం ఉండేది కాదు' అని అంటున్నాడు అభి.
ఇవీ చదవండి: డబ్బులు లేకున్నా లాటరీ టికెట్- రూ.6కోట్ల జాక్‌పాట్