ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం పోషించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్.. కశ్మీర్ సమస్యపై స్పందించారు.
"గతంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్ సమస్య పరిష్కారానికి అతి సమీపానికి వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 130 కోట్ల మంది ప్రజల కోసం శాంతికి విఘాతం కలిగించే అంశాలను పరిష్కరించాలి. భారత్ అణ్వాయుధాలను వదులుకుంటే తామూ అందుకు సిద్ధం. పుల్వామా ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
కశ్మీర్ అంశం మీద భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినట్లు ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి: 'ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే'