టీకా తయారీ వేగవంతం కోసం ట్రిప్స్(వర్తక సంబంధిత మేధో హక్కులు) నిబంధనలను రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం మద్దతు తెలపడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నామని అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధు పేర్కొన్నారు.
వ్యాక్సిన్ల తయారీని వేగంగా చేపట్టేందుకు ఈ నిబంధనలను తాత్కాలికంగా ఎత్తివేయాలని భారత్, దక్షిణాఫ్రికా.. డబ్ల్యూటీఓలో ప్రతిపాదించాయి. ఈ విషయంపై గత కొద్దివారాలుగా అమెరికాలోని పలువురు దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతున్నారు తరన్‌జిత్ సింగ్. ఎట్టకేలకు ఈ ప్రతిపాదనకు అమెరికా మద్దతు తెలిపింది.
డబ్ల్యూహెచ్ఓ స్పందన
టీకాల కోసం తాత్కాలికంగా ఈ నిబంధనలను ఎత్తివేసేందుకు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ స్వాగతించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు అమెరికాను ప్రశంసించారు. వైద్యపరమైన సవాళ్ల పరిష్కారంలో బైడెన్ చూపించిన నిబద్ధత.. అమెరికా నాయకత్వ పటిమకు ఉదహరణ అని అన్నారు. అయితే ఈ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, బైడెన్ యంత్రాంగం నుంచి తాను ఇదే ఆశించానని అన్నారు.
చట్టసభ్యుల హర్షం
మరోవైపు, బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని చట్టసభ్యులు స్వాగతించారు. టీకా సరఫరాను పెంపొందించడంలో ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. అన్ని దేశాలకు టీకా అందేలా చూసేందుకు బైడెన్ దృష్టిసారించారని అన్నారు. ఈ నిర్ణయం అపూర్వమైనదని కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. ఫార్మా లాభాలకన్నా.. మనుషుల ప్రాణాలే తమకు ప్రధానమని అమెరికా నాయకత్వం స్పష్టం చేసిందని చెప్పుకొచ్చారు. ఆమెతో పాటు జాన్ లార్సన్, జాన్ షాకోవ్స్కీ, రోసా డెలారో, లాయిడ్ డగెట్, ఎర్ల్ బ్లమెనార్ సహా పలువురు చట్టసభ్యులు ఇందుకు మద్దతు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'పూనావాలాకు జడ్ ప్లస్ భద్రత కల్పించండి'