అమెరికాలో గన్‌కల్చర్ విషం చిమ్ముతోంది. విచ్చలవిడిగా మోగుతున్న తుపాకులతో అమాయక ప్రాణాలు నేలరాలుతున్నాయి. అగ్రరాజ్యంగా పేరొందిన ఈ దేశంలో బహిరంగ కాల్పులు యథేచ్చగా జరగడం విపరీత పోకడకలకు అద్దం పడుతోంది. కరోనా కారణంగా గతేడాది కాస్త తగ్గుముఖం పట్టిన కాల్పుల ఘటనలు ఈ ఏడాది మాత్రం అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. తాజాగా.. ఇండియానా పోలిస్‌లో చోటు చేసుకున్న కాల్పుల ఘటన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఫెడెక్స్ కొరియర్ సేవల సంస్థ వద్ద దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆగంతకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఫెడెక్స్ ఇండియానా పోలిస్ కేంద్రంలో.. దాదాపు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫెడెక్స్‌కు ఉన్న రెండో అతిపెద్ద కేంద్రం.
విచ్చలవిడిగా..
ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 147సార్లు బహిరంగ ప్రదేశాలలో కాల్పులు జరిగాయంటే అమెరికాలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చిలో అట్లాంటాలోని వేర్వేరు మసాజ్‌పార్లర్లలో జరిగిన కాల్పుల ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉండటం.. అందులోనూ 6గురు ఆసియన్లు కావటంతో ఆసియన్ అమెరికన్ వర్గం నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటన జరిగిన వారం రోజులకే కొలరాడోలోని బౌల్డర్‌లో.. ఓ సూపర్ మార్కెట్ వద్ద ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికంగా ఉన్న దుకాణం నుంచి తుపాకీ కొనుగోలు చేసి దుండగుడు ఈ కాల్పులకు తెగబడ్డాడు. మరికొన్ని రోజుల తర్వాత.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓరెంజ్ నగరంలో ఓ వాణిజ్య భవనంలో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారు.
ఇవీ చదవండి: అమెరికాలో పడవ మునక- 12 మంది గల్లంతు