త్వరలోనే మరో రూపంలో అమెరికా ప్రజల ముందుకు వస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కుటుంబంతో సహ వైట్‌హౌజ్‌కు వీడ్కోలు పలికిన ట్రంప్.. జాయింట్ ఎయిర్‌ఫోర్స్ బేస్ ఆండ్రూస్‌లో మద్దతుదారులనుద్దేశించి ప్రసగించారు.
అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించడం తన అదృష్టమన్న ట్రంప్.. దేశ ప్రజల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది దీర్ఘకాలిక వీడ్కోలు కాకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు శ్వేతసౌధాన్ని ఖాళీ చేసిన ట్రంప్.. మిలటరీ హెలికాఫ్టర్‌లో జాయింట్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం ఆండ్రూస్‌కి చేరుకున్నారు. అక్కడ ప్రసంగం పూర్తైన తర్వాత ఫ్లోరిడా బయలుదేరారు.
" ఈ నాలుగేళ్లు అద్భుతమైనవి. మనమంతా చాలా సాధించాం. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, నాఉద్యోగులకు కృతజ్ఞతలు. మీ సేవలకు ధన్యవాదాలు. మన కుటుంబం ఎంత కష్టపడిందో జనాలకుతెలియదు. అమెరికా ప్రపంచంలోనే గొప్ప దేశం. గొప్ప ఆర్థికవ్యవస్థ ఉన్న దేశం. మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం.వైద్య చరిత్రలోనే అరుదైనదిగా పరిగణించేలా.. 9నెలల్లోనేవ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాం. నేను మీ కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. కొత్తప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అద్భుతాలు సృష్టించేందుకు వారికితగిన పునాది ఉంది."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు