అమెరికా క్యాపిటల్ భవనంపై ఈనెల 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ ఘటన నేపథ్యంలో అగ్రరాజ్య సైనిక ఉన్నతాధికారులు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను బలగాలకు గుర్తు చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛ.. ఎవరికీ హింసను ప్రేరేపించే అధికారాన్ని ఇవ్వదని నొక్కి చెప్పారు. ఇలా సైనికాధికారులు ప్రకటన విడుదల చేయటం చాలా అరుదు.
మంగళవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అమెరికా మోస్ట్ సీనియర్ జనరల్ మార్క్ మిల్లేతో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లోని 8 మంది అధికారులు సంతకాలు చేశారు. క్యాపిటల్‌పై జరిగిన దాడిని ఖండించారు. జనవరి 20న జో బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు మరింత హింసకు పాల్పడే అవకాశం ఉందన్న భయాల మధ్య ఈ మేరకు ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"గతం నుంచి ఇప్పటి వరకు అనుసరిస్తున్నట్లుగానే.. అమెరికా సైన్యం పౌర నాయకత్వం ఇచ్చే చట్ట పరిధిలోని ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది. ఆస్తులు, ప్రజల ప్రాణాలు రక్షించేందుకు పౌర అధికారులకు మద్దతుగా నిలుస్తుంది. చట్టం ప్రకారం ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తుంది. విదేశీ, దేశీయ శత్రుల నుంచి అమెరికా రాజ్యాంగాన్ని రక్షించేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంది. సేవకులుగా దేశ విలువలు, ఆదర్శాలను కలిగి ఉండాలి. రాజ్యాంగ ప్రక్రియకు భంగం కలిగించే ఎలాంటి చర్య అయినా.. అది మన సంప్రదాయం, విలువలకు మాత్రమే వ్యతిరేకం కాదు. అది చట్టానికి వ్యతిరేకం. భావ ప్రకటన స్వేచ్ఛ.. హింస, దేశద్రోహం, తిరుగుబాటును ఆశ్రయించే హక్కును ఎవరికీ ఇవ్వవు. "
- అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్
160 మందిపై కేసులు
ఈనెల 6న అమెరికా క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి ఘటనలో 160 మందికిపైగా కేసులు నమోదు చేసింది ఎఫ్‌బీఐ. ఆరు రోజుల్లోనే ఈ కేసులు నమోదు చేశామని, ఈ చర్య చాలా చిన్నదని ఇంకా ఎంతో ఉందని నొక్కి చెప్పారు అధికారులు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతిఒక్కరిని ఇంటింటికి వెళ్లి పట్టుకుంటామని, అయితే.. స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు ఒక అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'బైడెన్ ప్రమాణస్వీకారం రోజు అమెరికాలో అల్లర్లు!'