50 బిలియన్ డాలర్లతో ప్రపంచ వ్యాక్సినేషన్ ప్రణాళికను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రతిపాదించింది. దాని వల్ల 2021 చివరి నాటికి 40 శాతం ప్రపంచ జనాభాకు వ్యాక్సిన్ అందుతుందని చెప్పింది. 2022 మొదటి అర్ధభాగం నాటికి 60 శాతం మందికి టీకా అందుతుందని పేర్కొంది. ఈ మేరకు జీ20 ఆరోగ్య సదస్సులో ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పేర్కన్నారు.
"భారీ ఆర్థిక సాయం, బలమైన సహకార చర్యల ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడగలదు. కొంతకాలంగా భయంకరమైన ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నాం. వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న దేశాలకు, లేని పేద దేశాలకు మధ్య అంతరం పెరిగే కొద్దీ అసమానత మరింత తీవ్రమవుతుంది."
-క్రిస్టాలినా జార్జివా, ఐఎంఎఫ్ ఎండీ
డబ్ల్యూహెచ్‌ఓ, ప్రపంచ బ్యాంక్, గవి, ఆఫ్రికన్ యూనియన్ సహా ఇతర సంస్థల లక్ష్యాలు నెరవేరాలని క్రిస్టాలినా అన్నారు. ఇందుకు మూడు ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అందులో మొదటగా.. 2021 చివరినాటికి 40 శాతం మందికి, 2022 అర్ధభాగం నాటికి 60 శాతం మందికి టీకా వేయాలని చెప్పారు. ఇందుకోసం కొవాక్స్ కార్యక్రమానికి నిధులను సమకూర్చాలని.. దేశాల మధ్య ముడిపదార్థాలు, వ్యాక్సిన్ల రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని పేర్కొన్నారు.
వైరస్ కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా అదనంగా వంద కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేయడాన్ని రెండవ చర్యగా క్రిస్టాలినా చెప్పారు. వ్యాక్సిన్ సరఫరా కొరత ఉన్న ప్రాంతాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, చికిత్సలు విస్తృతంగా జరగడాన్ని మూడో చర్యగా పేర్కొన్నారు. ఈ మూడు చర్యల కోసం 50 బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు.
ఆ దేశాలకు భారత్ ఓ హెచ్చరిక
కరోనా రెండో దశ వ్యాప్తితో భారత్లో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సంక్షోభం.. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరిక వంటిదని ఐఎంఎఫ్ పేర్కొంది. 2021 నాటికి భారత్లో 35 శాతం మందికి మాత్రమే టీకా పంపిణీ జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎంఎఫ్ ఆర్థికవేత్త రుచిర్ అగర్వాల్, ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ సమర్పించిన నివేదిక తెలిపింది.
కరోనా మొదటి దశ వ్యాప్తిని భారత్ ఆరోగ్యవ్యవస్థ సమర్థంగా ఎదుర్కొందని.. కానీ, రెండో దశ వ్యాప్తిలో పరిస్థితులు తారుమారయ్యాయని ఐఎంఎఫ్ నివేదిక చెప్పింది. ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకలు, చికిత్స అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. అందరికీ వ్యాక్సిన్లు అందేలా.. భారత్ అదనంగా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి: 'కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్'