కొవిడ్ పరీక్షల పరిశోధనలో మరో మైలురాయి! అత్యంత తక్కువ ఖర్చుతో.. కచ్చితమైన ఫలితాన్ని, వేగంగా అందించే సరికొత్త పరికరాన్ని ఇలినోయిస్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. బ్యాటరీతో నడిచే ఈ పరికరం చేతిలో ఇట్టే ఒదిగిపోతుంది. అత్యంత చిన్న లాలాజలం చుక్కలోని వైరస్ జాడను కూడా ఈ పరికరం పసిగట్టి.. అరగంటలో సరైన ఫలితాన్ని వెల్లడిస్తుందని పరిశోధనకర్త హుయిమిన్ ఝావో చెప్పారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా దీన్ని వాడుకోవచ్చని.. శాంపిళ్లను ఈ పరికరంలోకి చొప్పించినప్పుడు జాగ్రత్త వహిస్తే చాలని అన్నారు.
"వైరస్‌లోని ప్రత్యేక జన్యువులను గుర్తించేలా వాటి డీఎన్‌ఏ సమాచారంతో కూడిన కొన్ని ఎంజైములను రూపొందించాం. తర్వాత వాటిని మేము తయారుచేసిన పరికరంలో అమర్చాం. లక్షిత జన్యువులను గుర్తించిన వెంటనే ఈ ఎంజైముల్లో ఉండే ట్యాగ్‌లు వెలుగులు విరజిమ్ముతాయి. దీంతో ఈ పరికరం 'పాజిటివ్' సంకేతం ఇస్తుంది. స్కేలబుల్ అండ్ పార్టబుల్ టెస్టింగ్ (స్పాట్)గా పిలిచే ఈ విధానం చాలా సులభమైనది" అని హుయిమిన్ వివరించారు.
ఇదీ చదవండి: 'కనిష్ఠ స్థాయికి మోదీ ప్రతిష్ఠ'