మానవాళి చరిత్రలో, ఆఖరి రోమన్ చక్రవర్తి నీరోది అత్యంత దిగ్భ్రాంతకరమైన మకిలి అధ్యాయం. ముప్ఫయ్యో ఏట ఆత్మహత్య చేసుకోవడం ద్వారా అర్ధాంతరంగా కథ ముగిసిపోయిన నీరో చక్రవర్తి ఊసెత్తగానే ఎందరికో ఒక ఘటన తలపుల్లో మెదులుతుంది. రోమ్ నగరం తగలబడుతుండగా అతడు ఫిడేలు వాదనంలో తలమునకలయ్యాడన్న కథ విశేష ప్రాచుర్యంలో ఉంది. అలవిమాలిన క్రూరత్వానికి, అంతకుమించి బాధ్యతల నిర్వహణలో వల్లమాలిన అలసత్వానికి మారుపేరుగా అలనాటి నీరో చక్రవర్తి పరువు మాశాడు. ఆధునిక ప్రపంచంలోనూ విధ్యుక్త ధర్మాన్ని గాలికొదిలేసి, జాతిజనుల నెత్తిన మహోత్పాతం ఉరుముతున్నా పెద్దగా పట్టించుకోకుండా అభినవ నీరోలనిపించుకుంటున్న వారెందరో ఉన్నారు. కరోనా నేపథ్యంలో అటువంటి వారివల్ల ఏయే దేశాల స్థితిగతులు ఎంతగా మారిపోయాయో పరికిద్దాం...
అమెరికా
అగ్రరాజ్యమైన అమెరికాకు చెందిన సైన్యంలో 'నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ ఇంటెలిజెన్స్' అనే విభాగముంది. దాదాపు వందమంది వైరాలజిస్టులు, జీవశాస్త్రవేత్తలు, రసాయన ఇంజినీర్లు, సైనిక వైద్య నిపుణులతో కూడిన ఆ విభాగం అమెరికా భూభాగం మీద కరోనా వైరస్ బీభత్సం సృష్టించనుందని ఫిబ్రవరిలోనే హెచ్చరించింది. సత్వర చర్యలు చేపట్టకపోతే త్వరలోనే అది దేశమంతటా పెచ్చరిల్లనుందని ప్రమాద ఘంటికలు మోగించింది. కీలక విభాగం సూచనల్ని తుంగలో తొక్కిన అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఆ వైరస్ విషయంలో ఏమాత్రం హైరానా పడనక్కర్లేదని అదే రోజున తమ దేశవాసులకు భరోసా దయచేశారు. కేసుల సంఖ్య విస్తరించేకొద్దీ ట్రంప్ నాలుక ఎన్నెన్ని విడ్డూర భాష్యాలకు తెగబడిందో లెక్కేలేదు. క్రిమినాశక రసాయనాల్ని రోగి శరీరంలోకి ప్రవేశపెట్టాలన్న విడ్డూర ప్రతిపాదనతో నవ్వులపాలైన ట్రంప్, పరీక్షలపైనా తనదైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విరివిగా పరీక్షలు నిర్వహిస్తే రోగుల సంఖ్య పెరుగుతోందని, పరీక్షలు మానేస్తే కేసుల సంఖ్య తగ్గిపోతుందని సెలవిచ్చారు.
రష్యా
ఒకప్పుడు అమెరికాతో ఢీ అంటే ఢీ అనేలా ఎదురునిలిచిన సోవియట్ యూనియన్‌కు ఛాయామాత్ర ప్రతిబింబంగా మిగిలిన దేశం రష్యా. ఒక్కరోజులోనే వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్న అధ్యక్షులు పుతిన్ నేతృత్వంలో నేడది అక్షరాలా దీనవదన. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అరకొర చర్యలు సరిపోవన్న సూచనలు మార్చి నెలలోనే వినిపించినా, వాటిని పుతిన్ ఏమంత లెక్కచేయలేదు. తమ పరిస్థితి మెరుగ్గానే ఉందన్న ధీమాతో ఇటలీకి వైద్యసిబ్బందిని, వెంటిలేటర్లను, ఇతరత్రా సామగ్రిని పంపిన రష్యా- రోజుల వ్యవధిలోనే నిస్సహాయస్థితిలో కూరుకుపోయింది. మాస్కులు, వైద్య పరికరాలకు కొరత ఉందని బహిరంగంగా విమర్శించిన వైద్యురాలిని, ఆమె సహచరుల్ని జైల్లోకి నెట్టారు. నేడక్కడ 80 లక్షల దాకా ఉద్యోగాలు గాలిలో కలిసిపోయాయని అంచనా. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించాక- ‘ప్రమాద తీవ్రతను అధికారులు తక్కువగా అంచనా వేసినట్లు కనిపిస్తోంది...’ అని అధ్యక్ష కార్యాలయం తీరిగ్గా స్పందించింది.
బ్రెజిల్
జెయిర్ బొల్సొనారో- బ్రెజిల్ దేశాధ్యక్షులు. ఫిబ్రవరి 26న అక్కడ మొదటి కొవిడ్ కేసు వెలుగుచూసింది. ప్రసార సాధనాలది మితిమీరిన స్పందనగా దుయ్యబట్టి, సమస్యను చిన్నదిగా చూపించే యత్నానికే ఆయన పెద్దపీట వేశారు. సంక్షోభ తీవ్రతకు తగ్గట్లు దీటైన చర్యలు చేపట్టాలన్న పాపానికి ఇద్దరు ఆరోగ్య మంత్రుల్ని పదవి నుంచి ఊడబెరికారు. కరోనా వైరస్ వల్ల ముప్పేమీ ఉండబోదని, కొద్దిపాటి జలుబుగా దాన్ని తీసిపారేస్తూ- సూపర్ మార్కెట్లలో, బేకరీల్లో జనంతో విరివిగా కరచాలనాలు చేసిన ఘనుడాయన. ఇప్పటికీ కరోనా వల్ల ముప్పును ప్రపంచమే ఎక్కువగా ఊహించుకుంటున్నదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం!
పాకిస్థాన్
పొరుగున పాకిస్థాన్‌లో భారీ అంచనాలతో ఇమ్రాన్ ఖాన్ అధికారం చేపట్టి రెండేళ్లయినా కాలేదు. కరోనా కట్టడిలో ఆయన సర్కారు అసమర్థంగా వ్యవహరించిందన్న తీవ్ర అసంతృప్తి అటు సైన్యంలో, ఇటు ప్రజానీకంలో బలపడుతోంది. రెండు నెలలపాటు మహమ్మారి వైరస్ నియంత్రణ అంశాన్నే పట్టించుకోలేదని ఇమ్రాన్‌పై విపక్షాలు విమర్శలకు పదునుపెడుతున్నాయి. ‘రెండు వారాల క్రితం దేశంలో పరీక్షల సామర్థ్యం (రోజుకు) 50 వేలకు పెరిగిందన్నారు... ఇప్పుడు 20 వేల లోపేనంటే- అసలేం జరుగుతున్నట్లు?’ అని అవి సూటిగా నిగ్గదీస్తున్నాయి. చైనాలో కరోనా విశృంఖలత్వం గురించి తెలిసీ, ఏడెనిమిది వారాలపాటు ఆ అంశాన్నే పట్టించుకోని నేతాగణం అలసత్వానికి పాక్ ప్రస్తుతం భారీ మూల్యం చెల్లిస్తోంది.
ఇటలీ
ప్రమాద సంకేతాన్ని పెడచెవిన పెట్టిన ఇటలీలో ప్రస్తుతం కొవిడ్ కేసులు రెండు లక్షలకు మించిపోయాయి. మరణాలు 32 వేలకు చేరువవుతున్నాయి. సుసంపన్నమైన బెర్గామో పట్టణంలో వందలమంది జనం పిట్టల్లా రాలిపోయారు.
ఇరాన్
కరోనాతో మాకు ప్రమాదమన్నదే లేదు... క్వారంటైన్ పద్ధతి రాతియుగాల నాటి అనాగరిక చర్య!’ అని గొప్పలకు పోయిన ఇరాన్‌లో దాదాపు లక్షా 20 వేల కేసులు నమోదయ్యాయి. ఏడు వేలమంది వరకు నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు.
బెలారస్
బెలారస్ అధ్యక్షులు లువకషెంకోవ్ బాణీయే వేరు. ప్రపంచ దేశాలు కరోనా ధాటికి కకావికలమవుతుంటే- 'ఆందోళన ఎందుకు... వోడ్కా సేవిస్తూ పెంపుడు గొర్రెల్ని ముద్దాడితే ఎటువంటి కంగారూ దరి చేరదు' అని ఉద్బోధించడం ఆయనకే చెల్లింది.
ఇండోనేసియా
'ఇండొనేసియాలో కరోనా వైరస్ అన్నదే లేదు' అని అక్కడి రక్షణ మంత్రి ముహమ్మద్ మహ్‌ఫూద్ ఢంకా బజాయించిన కొన్ని వారాలకు అక్కడ ఆరోగ్య ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు.
బ్రిటన్
కొద్దిపాటి రిస్క్ తప్ప కరోనా వైరస్ వల్ల పెద్దగా ప్రమాదమేమీ లేదన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్- తనకే కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయ్యాక మాట మార్చారు.
స్పెయిన్
మార్చినెలలో కేసులు వెల్లడైనా క్రీడామైదానాలు, ర్యాలీల్లో భారీ సమూహాల్ని అనుమతించిన స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఔదార్యానికి ఫలితం- ఇంచుమించు రెండు లక్షల 75 వేల కేసులు, 28 వేల మరణాలు. దేశీయంగానూ కరోనా దుష్పరిణామాలను ఊహించలేక జ్వరం మాత్రలు, బ్లీచింగ్ పౌడర్ చికిత్సలను సిఫార్సుచేసిన ఉదంతాలున్నాయి.
కరోనా అదృశ్య శత్రువు. ఆ వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టడంలో అలసత్వం ప్రదర్శించే ఎవరైనా అభినవ నీరోలే!
- బాలు