- లక్షలాది మందిని బలిగొన్న మశూచిని టీకాతోనే జయించాయి ప్రపంచ దేశాలు.
- కోట్లాది మందిని అంగవైకల్యంతో కబళించిన పోలియోకు సూది మందుతో అడ్డుకట్ట పడింది.
- 2019 చివర్లో పుట్టుకొచ్చి మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనాకు సైతం అనతి కాలంలోనే వ్యాక్సిన్‌ను తయారు చేసి.. వైరస్‌పై వజ్రాయుధంగా వాడుతున్నారు. అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నారు.
- మరి 37ఏళ్ల క్రితం గుర్తించిన ఎయిడ్స్‌కు ఇప్పటికీ టీకాను ఎందుకు కనుక్కోలేకపోయారు?
ఇది అనేక ఏళ్లుగా వేధిస్తున్న ప్రశ్న. కరోనా వెలుగులోకి వచ్చిన అనతి కాలంలో టీకాపై పరిశోధనలు.. ప్రయోగాలు.. వినియోగం వెనువెంటనే జరిగిపోయిన నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది.
హెచ్ఐవీపై విశేషంగా పరిశోధనలు చేస్తున్న అమెరికాకు చెందిన మయామీ మిల్లెర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీలో పాథాలజీ ప్రొఫెసర్ రొనాల్డ్ సీ డెస్రోసియర్స్ కీలక విషయాలను వెల్లడించారు.
ఎయిడ్స్‌కు కారణమయ్యే హ్యూమన్ ఇమ్యునో డెఫీషియెన్సీ వైరస్(హెచ్ఐవీ)ని పోలిన సిమియన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్(ఎస్ఐవీ) కోతిలో ఉన్నట్లు తమ ల్యాబ్‌లోనే కనుగొన్నామని తెలిపారు రొనాల్డ్. తాము చేసిన పరిశోధనలు టీకా అభివృద్ధికి దోహదపడుతాయని వివరించారు. ఆయన మాటల్లో మరిన్ని వివరాలు మీకోసం..
ప్రధాన అవరోధం ఏంటి?
ఎయిడ్స్‌కు కారణం హెచ్ఐవీ అని 1984లో అమెరికా ఆరోగ్యశాఖ ప్రకటించింది. రెండేళ్లలో వ్యాక్సిన్ తీసుకొస్తామని నాడు చెప్పింది. అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ తీసుకురాకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదు. తగినన్ని నిధులు కేటాయించకపోవడమూ కాదు. అసలు సమస్య... ఆ వైరస్సే. హెచ్ఐవీలోని వేర్వేరు వేరియంట్లు, టీకా ప్రభావాన్ని సైతం తట్టుకోగల వాటి శక్తి ఎయిడ్స్‌పై విజయం సాధించడానికి అవరోధంగా మారాయి.
ఇప్పటి వరకు ఎన్ని పరిశోధనలు జరిగాయి?
హెచ్ఐవీ అనేది చాలా భిన్నమైన వైరస్. దీనిపై ఇప్పటి వరకు భారీ స్థాయి మూడో దశ ట్రయల్స్ ఐదు జరిగాయి. ఒక్కోదాని కోసం 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇందులో మొదటి మూడు ట్రయల్స్ విఫలమయ్యాయి.
నాలుగో ట్రయల్‌లో హెచ్ఐవీకి వ్యతిరేకంగా తక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. అయితే 78శాతం కన్నా తక్కువ సామర్థ్యం నమోదైనట్లు పరిశోధకులు తెలిపారు. ఐదో దేశ ప్రారంభంలోనే ఆగిపోయింది. ఎలాంటి రక్షణ వ్యవస్థ మెరుగవ్వకపోవడం వల్ల తిరిగి ట్రయల్స్ నిర్వహించాలని ఆదేశించారు.
వ్యాక్సిన్ తయారీ ఎందుకంత కష్టం?
హెచ్ఐవీ వైరస్ లోపలకు వెళ్లగానే జన్యువు అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఒక వ్యక్తిలోనే అనేక ఉత్పరివర్తనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దాని సొంతం. చాలా వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో రక్షణ వ్యవస్థను కలిగి ఉండవు. అవి వైరస్ తీవ్రతను తగ్గించగలవు. హెచ్ఐవీ విషయంలో కూడా అలాగే చేయాలి.
వ్యాక్సిన్‌ను ఎలా రూపొందించాలి?
యాంటీబాడీలను రక్షణ వ్యవస్థగా మలుచుకునే అద్భుతమైన సామర్థ్యం హెచ్ఐవీ సొంతం. కరోనా, హెర్పిస్ కంటే ఇది చాలా భిన్నమైనది. వైరస్‌లలోని 22 కుంటుంబాల్లో ఇది అత్యధికంగా చక్కెర స్థాయి కలిగిన ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ భాగం చక్కెరను కలిగి ఉంటుంది. ప్రతిరోధకాల నుంచి రక్షణ పొందడానికి ఇది చక్కెరలను ఉపయోగించుకుంటుంది. రోగి కణాన్ని చక్కెరలను జోడించి దాని నియంత్రణలోకి తెచ్చుకుంటుంది. ఇలాంటి అంశాలు టీకా అభివృద్ధిలో కీలకంగా మారతాయి. అయితే హెచ్ఐవీ వేరియంట్లను తటస్థం చేసి యాంటీబాడీలను ఎలా పొందాలో పరిశోధకులకు తెలుసు.
పరిశోధన ఆపేయాలా?
హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ కంటే వైరసే ఒక అడుగు ముందు ఉంటుంది. అది ఆ వ్యక్తిలో నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీంతో ఇక వ్యాక్సిన్‌ను అభివృద్థి చేయడం కష్టమని చాలామంది అనుకుంటున్నారు. అలాగని ఇక పరిశోధనను ఆపకూడదు. మన ముందు అవకాశాలు ఉన్నాయి.
- రెండు ప్రయోగశాలల్లో జంతువులపై పరిశోధనలు చేస్తున్నారు. హెర్పిస్ వైరస్‌ను వాహకంగా చేసుకొని హెచ్ఐవీ ప్రోటీన్స్‌ను జంతువు శరీరంలోకి ప్రవేశించేలా చేస్తారు. హెర్పిస్ వైరస్ ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే జీవితాంతం ఉండిపోతుంది. ఇలా చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ నిరంతరం చురుగ్గా ఉండేలా చేస్తున్నారు. తద్వారా దీర్ఘకాలంలో బలమైన ప్రతిస్పందనలు ఎలా పొందాలో తెలిసే అవకాశం ఉంది.
- హెచ్ఐవీ ఎదుర్కొనేందుకు మరో అవకాశం ఉంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను కనుక్కోవడం. ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది బలహీనమైన ప్రతిస్పందనలనే కలిగి ఉంటారు. చాలా అరుదుగా బలమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు. వాటి ద్వారా విస్తృతమైన ప్రతిస్పందనలను తయారు చేయడం అవసరం.
- హెచ్ఐవీ నుంచి జీవితాంతం రక్షణ వ్యవస్థలను సాధించడానికి శాస్త్రవేత్తలు కీలక పరిశోధన ఒకటి చేస్తున్నారు. అడెనో-అసోసియేట్ వైరస్ ఆధారంగా ఈ పరిశోధన కండరాలపై జరుపుతున్నారు. కండరాల కణాలను రోగనిరోధక వ్యవస్థ కర్మాగారాలుగా మార్చి.. విస్తృతమైన తటస్థంగా ఉండే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసే వ్యవస్థపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక కోతిపై ఆరున్నర సంవత్సరాలు ఈ ప్రయోగం సాగనుంది.
ఇదీ చదవండి: సద్గురు పెయింటింగ్ విలువెంతో తెలుసా?