Heavy Rains In Brazil: బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 19 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అటు.. ఎంబు దాస్ అర్టెస్ నగరంలోని ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
"భారీవర్షాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించడం బాధాకరంగా ఉంది. ఈ ఘటనల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోంది" అని సావో పాలో గవర్నర్ ఓ దొరియా తెలిపారు.
సుమారు 5 లక్షల కుటుంబాలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 2.8 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఒకేసారి ఆరు వాహనాలు ఢీ- తొమ్మిది మంది మృతి