గతం...
2016 అధ్యక్ష ఎన్నికలు... డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆమెదే గెలుపని వార్తలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అనే వ్యాపారి బరిలో నిలిచారు. ఆయనపై మహిళలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వాపోయారు. ఎన్నికలు ముగిశాయి. అత్యధిక జాతీయ మీడియా సర్వేలన్నీ ఏకపక్షంగా హిల్లరీదే గెలుపని నినదించాయి.
కానీ... ఫలితాలు చూస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మీటూ ఆరోపణలు చుట్టుముట్టినా, ఎంతోమంది మహిళలు గగ్గోలు పెట్టినా ట్రంప్ గెలుపును ఆపలేకపోయారు. అప్పట్లో ఈ ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి.
ప్రస్తుతం...
దాదాపు నాలుగేళ్ల తర్వాత... 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యే సమయంలో మరోసారి 'ద టచ్' ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పేరు వినిపిస్తున్న జో బిడెన్‌పై. ఆయన అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు.
బిడెన్ వల్ల అసౌకర్యానికి గురయ్యామని ఇటీవల నలుగురు మహిళలు వాపోయారు. నెవాడా అసెంబ్లీ మాజీ సభ్యురాలు లూసీ ఫ్లోర్స్ 2014 ఎన్నికల ప్రచారంలో బిడెన్ తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. మరో ముగ్గురు మహిళలదీ అదే కథ. ఈ విషయంపై డెమొక్రాట్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది సెనేటర్లు ఈ ఆరోపణలపై బిడెన్ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే బిడెన్ స్పందించారు. ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
"నా కెరీర్లో ఎప్పుడూ మానవ సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నించాను. అది నా బాధ్యతగా భావిస్తాను. షేక్ హ్యాండ్ ఇస్తాను, హత్తుకుంటాను, పురుషులు, మహిళల భూజాలపై చేయి వేసి మీరు ఏదైనా చేయగలరని ప్రోత్సహిస్తాను. పురుషులు, మహిళలు, యువకులు, ముసలివాళ్లు ఎవరితోనైనా నేను ఇలానే ఉంటాను. ప్రస్తుత సమాజంలో వ్యవహరించే తీరు మారుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు మారాయి. నాకు అర్థమైంది. వారు చెబుతున్నది నేను విన్నాను. ఇక నుంచి నా హద్దుల్లో నేను ఉంటాను."
- జో బిడెన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు
బిడెన్ ప్రకటనపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తంచేశారు.
"ఆయన ప్రకటన బాధ్యతారాహిత్యంగా అనిపించింది. ఆ రోజు ఆయన వ్యవహరించిన తీరుకంటే ఇప్పుడు చెప్పిన మాటలే ఎక్కువగా బాధిస్తున్నాయి. ఆయన ఈ ఆరోపణలపై బాధ్యత తీసుకోవడం లేదు. రెండోది ఆయన ఈ పని చేసినట్లు అందరికీ తెలుసు."
-అమీ లప్పోస్, బిడెన్‌పై ఆరోపణలు చేసిన మహిళ
ప్రతినిధుల సభ స్పీకర్ నాస్సీ పెలోసీ మాత్రం ఈ ఆరోపణల కారణంగా బిడెన్‌ను అధ్యక్ష బరిలో నుంచి పక్కన పెట్టకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ మద్దతుదారులు ఈ విషయంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బిడెన్ పలు సందర్భాల్లో మహిళలతో ఉన్న చిత్రాలను కలిపి 'క్రీపీ జో బిడెన్' పేరుతో ఓ వీడియో విడుదల చేశారు.
ట్రంప్ వదల లేదు...!
ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జో బిడెన్ పోస్ట్ చేసిన వీడియోకు మార్పులు చేసి 'వెల్కమ్ బ్యాక్ జో' శీర్షికతో ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు.
-
WELCOME BACK JOE! pic.twitter.com/b2NbBSX3sx
— Donald J. Trump (@realDonaldTrump) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">WELCOME BACK JOE! pic.twitter.com/b2NbBSX3sx
— Donald J. Trump (@realDonaldTrump) April 4, 2019WELCOME BACK JOE! pic.twitter.com/b2NbBSX3sx
— Donald J. Trump (@realDonaldTrump) April 4, 2019
పునరావృతం అవుతుందా..?
అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై బిడెన్ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఒక వేళ బరిలో నిలిస్తే... ఈ మీటూ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇదీ చూడండి: 'మా దేశం ఫుల్... ఎవరూ రావొద్దు'