అమెరికా పూర్వ అధ్యక్షులెవరూ చేయలేనంత పనిచేశానని ఉద్ఘాటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పదవి బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా యూఎస్‌కు చెందిన ఓ వార్తా ఛానెల్‌తో ముచ్చటించారు ట్రంప్. అధ్యక్ష పదవిలో తనకు ఎదురైన పలు సవాళ్లతో పాటు మరిన్ని అనుభవాలను పంచుకున్నారు. అగ్రరాజ్య అధినేతగా ప్రతి నిమిషాన్ని ఆస్వాదించానని చెప్పుకొచ్చారు.
మీడియా తనపై వార్తలు రాసే విధానమే ఇప్పటివరకు తనకున్న అతిపెద్ద నిరాశన్నారు ట్రంప్. తనను నీలికళ్ల అబ్బాయిగా, అతిపెద్ద సంస్థకు ఛైర్మన్‌గా అధ్యక్ష పదవి చేపట్టముందు వరకు కీర్తించిన మీడియా... బాధ్యతలు తీసుకున్నాక మరో విధంగా చూపించడం బాధించిందన్నారు.
అసత్య వార్తలపై
తనమీద వస్తున్న అసత్య వార్తలపై స్పందించారు ట్రంప్. తప్పుడు వార్తలు రావడంపై విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అలాంటి వార్తలపై తాను వివరణ ఇస్తే ప్రజలు నమ్ముతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్టులపై
అమెరికా మీడియా నుంచి తనను రక్షించుకోవడానికే ట్విట్టర్లో ఎక్కువగా పోస్టులు చేస్తుంటానని స్పష్టం చేశారు ట్రంప్. తాను చెప్పిన మాటలను సరిగా రాస్తే ట్వీట్ చేయనని వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌ను ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థగా అభివర్ణించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు 43వేల ట్వీట్లు చేశారు ట్రంప్.
పాఠశాలల్లో కాల్పులపై...
పాఠశాలల్లో కాల్పుల సమాచారం విన్నప్పుడు కోపం వస్తుందని వెల్లడించారు ట్రంప్. అది అందరికీ నిరాశ కలిగిస్తుందని, అమాయక పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 75 ఏళ్లు పైబడిన వారికి భోజనం ఉచితం