అమెరికా అధ్యక్ష భవన సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. శ్వేత సౌధానికి 1500 మీటర్ల దూరంలో లోగన్ సర్కిల్ వద్ద ఉన్న మెక్సికన్ రెస్టారెంట్ బయట ఈ ఘటన జరిగింది. ఒక దుండగుడు కారులో వచ్చి ఆ రెస్టారెంట్ బయట వేసిన టేబుల్స్ వైపు గురిపెట్టి 20 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన చోటు చేసుకొన్న సమయంలో సీఎన్‌ఎన్ శ్వేత సౌధం ప్రతినిధి జిమ్ అకోస్టా అక్కడే ఉన్నారు. కాల్పులతో షాక్‌కు గురైన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసినట్లు ఆయన ట్విటర్‌లో తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు.
అమెరికాలో తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఒక్క వాషింగ్టన్ డీసీ క్రైమ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2018 నుంచి కాల్పుల ఘటనలు ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 471 ఘటనలు రిపోర్ట్ అయ్యాయి. గతేడాది మొత్తం 434 ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తుపాకీ సంస్కృతి నిర్మూలనకు కఠన చర్యలు తీసుకొంటానని తెలిపారు. తుపాకులు విక్రయించే సమయంలో కొనుగోలుదారుల చరిత్ర తెలుసుకునేలా చట్ట సవరణలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి:గిడ్డంగిలో అగ్నిప్రమాదం- 14 మంది మృతి