అమెరికాను జాత్యహంకారం చాలా కాలంగా విడదీసిందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు గురై మంగళవారం నాటికి ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. బైడెన్ సహా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను శ్వేతసౌధంలో జార్జి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఆనందం, దుఃఖాన్ని వారు ఏకకాలంలో పంచుకున్నారు. జార్జి హత్యకు నివాళిగా.. జాత్యహంకారాలను అరికట్టేలా పోలీసింగ్ చట్టాన్ని తీసుకురావాలని వారు కోరారు.
జియాన్నాకు ఐస్‌క్రీం..
తన సోదరుడికి జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకునే రోజు ఇదేనని జార్జి సోదరుడు ఫిలోనైస్ ఫ్లాయిడ్ పేర్కొన్నారు. జార్జి వారసత్వాన్ని కాపాడే ఈ బిల్లు అర్థవంతంగా ఉండాలని బైడెన్ చెప్పారని జార్జి మేనల్లుడు బ్రాండన్ విలియమ్స్ తెలిపారు. తమ కుటుంబ బాగోగులను అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారని వివరించారు. ఈ సమావేశంలో... జార్జి ఫ్లాయిడ్ చిన్న కుమార్తె జియాన్నాతో కాసేపు ఉల్లాసంగా గడిపారు బైడెన్. తనకు ఆకలిగా ఉందని జియాన్నా వెల్లడించగా.. ఆమె కోసం ఐస్‌క్రీమ్, స్నాక్స్‌ను తెప్పించారు. అనంతరం బైడెన్‌తో కలిసి జియాన్నా ఫొటోలు దిగింది. జార్జికి ఆయన కుటుంబ సభ్యులంతా నివాళులు అర్పించారు.
అమెరికా అంతటా..
బైడెన్‌తో సమావేశానికి ఫ్లాయిడ్ సోదరి.. బ్రిడ్జెట్ దూరంగా ఉన్నారు. జార్జి ఫ్లాయిడ్ బిల్లు.. చట్టరూపం దాల్చినప్పుడే తాను వాషింగ్టన్కు వస్తానని ఆమె.. మిన్నెసోటా నుంచి తెలిపారు. జార్జి ఫ్లాయిండ్ మరణించిన ప్రాంతమైన మినియాపోలిస్‌లో.. బ్రిడ్జెట్తో పాటు మిగతా కుటుంబ సభ్యులు, మినియాపోలొస్ నగర మేయర్ జాకబ్ ఫ్రేతో కలిసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ సహా అమెరికాలోని ఇతర ప్రాంతాలు, విదేశాల్లోనూ జార్జి ఫ్లాయిడ్ సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. ఈ బిల్లు అమల్లోకి తేవాలని కోరుతూ కాంగ్రెస్ ప్రతినిధులతో తాను మాట్లాడానని బైడెన్ విలేకరులు సమావేశంలో పేర్కొన్నారు.
బైడెన్‌తో పాటు స్పీకర్ నాన్సీ పెలోసి, ఇతర కాంగ్రెస్ ప్రతినిధులు, రిపబ్లికన్ నేతలను జార్జి కుటుంబ సభ్యులు మంగళవారం కలుసుకున్నారు. గతేడాది మే 25న పోలీసు అధికారి డెరిక్ చౌవిన్.. జార్జిఫ్లాయిడ్ మెడపై మోకాలు మోపి కర్కశంగా హింసించి అతని మరణానికి కారణమయ్యాడు. అనంతరం ఆయన మృతిపై అమెరికా సహా ఇతర దేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
ఇదీ చూడండి: జాతి వివక్షతో నేల రాలిన ప్రాణాలు- ఉద్భవించిన ఆశలు