విదేశాల నుంచి అమెరికాకు వచ్చే అధిక నైపుణ్యం కలిగిన వలసదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ మద్దతిచ్చింది. ఇప్పటికే పలు పెద్ద సంస్థలు ఇందుకు సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది.
"మన దేశానికి(అమెరికాకు) వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుంది. హెచ్-4 ఈఏడీ కార్యక్రమానికి మేం మద్దతు ఇస్తున్నాం. దీని ద్వారా ఆవిష్కరణలు పెరిగి.. ఉద్యోగ సృష్టి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబాలకు ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా నిలుస్తుంది."
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
ఈ మేరకు.. హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీతత్వం దెబ్బతింటోందని అక్కడి న్యాయస్థానంలో దాఖలైన కేసులో గూగుల్.. మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. నైపుణ్య వలసదారుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను మేం కోరుకుంటున్నామని తెలిపింది.
హెచ్-4 ఈఏడీ కార్యక్రమం ద్వారా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు(హెచ్4 వీసాదారులు) అమెరికాలో పనిచేసుకునే అధికారం లభిస్తుంది. దీని ద్వారా సుమారు 90 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని గూగుల్ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలు కేథరీన్ లకావెరా తెలిపారు. ఇందులో 90శాతానికిపైగా మహిళలే ఉన్నారని వెల్లడించారు.
ఇదీ చదవండి: అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థపై హెచ్-1బీ దావా ఉపసంహరణ