ప్రపంచదేశాలను కరోనా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు, మరణాలు అంతకంతకూ విజృంభిస్తూనే ఉన్నాయి. అమెరికాపై ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఒక్కరోజు వ్యవధిలో ఆ దేశంలో రికార్డు స్థాయి మరణాలు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లోనే అక్కడ 2,108 మందిని బలితీసుకుంది కరోనా. కేసులు 5 లక్షలు మించిపోయాయి.
మొత్తం అమెరికాలో ఇప్పటివరకు 18,747 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల పరంగా ఇటలీని(18,849) త్వరలోనే దాటనుంది అగ్రరాజ్యం. స్పెయిన్‌లో 16081, ఫ్రాన్స్‌లో 13197 మంది మరణించారు.
ఆ దేశాల కంటే ఎక్కువ...
వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే కేసులు లక్షా 70వేలు దాటాయి. ఇతర దేశాలతో పోల్చుకున్నా ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక్కడ 7,800పైగా చనిపోయారు. న్యూజెర్సీలో దాదాపు 2000 మరణాలు సంభవించాయి.
కరోనా విజృంభిస్తున్నా.. అమెరికాలో మరణాలు 60 వేల దిగువనే నమోదవుతాయని తాజా అధ్యయనాలను ఉటంకించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గతంలో శ్వేతసౌధం- కరోనా వైరస్ కార్యదళం.. దేశంలో మరణాలు లక్ష నుంచి 2 లక్షలు మధ్య నమోదవుతాయని అంచనా వేసింది.
ప్రస్తుత కరోనా పరిస్థితులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశగా పయనిస్తోందని నిపుణులు అంటున్నారు.
చైనా..
కరోనాకు కేంద్రమైన చైనాలో శుక్రవారం మరో 46 కేసులు నమోదయ్యాయి. ఇందులో 42 మంది విదేశీయులే. మరో ముగ్గురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 3,339కి చేరింది.
చైనాలో మొత్తం 81, 953 కరోనా కేసులు ఉండగా.. రికార్డు స్థాయిలో 77 వేల 525 మంది డిశ్చార్జి అయినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ప్రస్తుతం మరో 1089 మందికి బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఆ కేసులు 34...
లక్షణాలు కనిపించని కరోనా కేసులు శుక్రవారం మరో 34 నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇందులో ఏడుగురు విదేశీయులని స్పష్టం చేశారు. ఈ కేసులు మొత్తం 1092కి చేరాయని పేర్కొన్నారు.
హాంగ్‌కాంగ్‌లో మరో 989 కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి. మకావులో శుక్రవారం 45, తైవాన్‌లో 382 మంది కరోనా బారినపడ్డారు.
యూకేలో రికార్డు..
బ్రిటన్‌లో రికార్డు స్థాయిలో శుక్రవారం ఒక్కరోజే 980 మంది కొవిడ్ కారణంగా మరణించారు. మొత్తం మరణాలు 8,958ని చేరాయి. మరో 8,681 కేసులు పుట్టుకొచ్చాయి. బాధితులు పెరుగుతుండటం వల్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఫ్రాన్స్‌లో ఒక్కరోజు 987, స్పెయిన్‌లో 634, ఇటలీలో 570, జర్మనీలో 129 మంది కరోనాకు బలయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 17 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య లక్షా 2 వేల 700 దాటింది.