కరోనా వైరస్ ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండాచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37 లక్షల 24 వేలకుపైగా కేసులు నమోదు కాగా 2 లక్షల 58 వేల మందిని మహమ్మారి బలి తీసుకుంది. 12 లక్షల 39 వేల మంది... వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 22 లక్షలకుపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో వైరస్ వాప్తిలో ఏ మాత్రం తేడా కనిపించట్లేదు. అక్కడ మొత్తం కేసులు 12 లక్షల 37 వేలు దాటగా.. 72 వేల మందికిపైగా మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 2333 మంది మృతిచెందారు.
ఐరోపా దేశాల్లో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ బ్రిటన్ను బెంబేలెత్తిస్తోంది. ఐరోపాలో అత్యధిక కరోనా మరణాల జాబితాలో ఇటలీని వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరింది. ఇప్పటివరకు అక్కడ 29 వేల 427 మంది మరణించారు. మంగళవారం మరో 693 మందిని కొవిడ్ బలితీసుకుంది.
గడిచిన 24 గంటల్లో ఇటలీలో 236, ఫ్రాన్స్‌లో 330 మంది ప్రాణాలు విడిచారు. ఈ దేశాల్లో వరుసగా 1075, 1089 కొత్త కేసులు నమోదయ్యాయి. స్పెయిన్‌లో మరో 185 మరణాలు, 2260 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.
జర్మనీలో కొత్తగా 850కిపైగా కేసులు నమోదుకాగా...కొవిడ్ కేసుల సంఖ్య లక్షా 67 వేలకు పెరిగింది. 6,993 మంది చనిపోయారు.
రోజూ 10 వేలు ప్లస్..
- రష్యాలో ఒక్కరోజే మరో 10,102 మందికి కరోనా వచ్చింది. ఇప్పటివరకు లక్షా 55 వేల మందికిపైగా కరోనా నిర్ధరణ కాగా.... మొత్తం 1451 మంది వైరస్ కారణంగా మరణించారు.
- ఇరాన్‌లో కొత్తగా 1323 మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. దేశంలో 6 వేల 340మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్‌లో మరో 6 వేల 5వందల మందికి కొవిడ్ వ్యాపించింది. ఇప్పటివరకు లక్షా 14 వేల 715 మందికి వైరస్ నిర్ధరణకాగా, మొత్తం 7 వేల 921 మంది మృతి చెందారు.
- పాకిస్థాన్‌లో మరో 38 మంది చనిపోగా..మృతి చెందిన వారి సంఖ్య 514కు పెరిగింది. కొత్తగా.... 11 వందల మంది కొవిడ్ బారినపడగా మొత్తం బాధితుల సంఖ్య 22 వేలు దాటింది.
- సింగపూర్‌లో 632 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 632 మంది చనిపోయారు.