ETV Bharat / international

అమ్మ కోసం చిన్నారి ఆరేళ్ల నిరీక్షణ- చివరకు కలిసిందిలా - డొనాల్డ్​ ట్రంప్​

క్షేమంగా ఉందనుకున్న కూతురు దిక్కుతోచక ఎక్కడో సంచరిస్తోందని ఆ తల్లికి తెలిస్తే.. మాసిన బట్టలతో.. వట్టికాళ్లతో దేశ సరిహద్దుల వెంబడి అనాథలా కనిపిస్తే.. ఆరేళ్ల తర్వాత ఆ తల్లి, కూతుళ్లు కులుసుకుంటే.. ఆ సమయంలో ఆ మాతృ హృదయం ప్రేమతో ఎంతలా ఉప్పొంగి ఉంటుంది.. ఆ పసి మనసు అమ్మను చూసి ఎలా మురిసిపోయి ఉంటుంది. ఏళ్ల తర్వాత నాటకీయంగా కలిసి ఆ తల్లి, కూతుళ్ల కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

US border
తల్లి చెంతకు
author img

By

Published : Jun 9, 2021, 10:43 PM IST

ఆరేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరిన కూతురు

అర్ధరాత్రి.. తెల్లవారితే మే 13. ఎమిలీ అనే చిన్నారి ఏడుస్తూ నడుస్తోంది. ఎటు వెళ్లాలో తెలీదు. కాలికి బురద. ఓ కాలి షూ లేదు. దాహం వేస్తోంది. చుట్టుపక్కల చుక్కనీరు లేదు. ఆరు గంటలు అలా నడుస్తునే ఉంది. తను ఎటుపోతున్నానో తెలియదు కానీ సరిగ్గా టెక్సాస్ సరిహద్దుకు చేరుకుంది. తనలాగే చాలా మంది పిల్లలు వెళుతున్నారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఏడుస్తున్న ఎమిలీని గమనించాడు. ఎటుపోతున్నావు అని అడిగాడు. తెలియదు అనే సమాధానం. తన తల్లి ఫోన్ ​నెంబర్ పోగొట్టుకున్నానని, అమ్మ ఎక్కడుంటుందో కూడా తెలియదని చెప్పింది. దాంతో ఆ చిన్నారిని ప్రభుత్వ డిటెన్షన్​ క్యాంప్​లో ఉంచాడు ఆ సిబ్బంది.

"మా అమ్మ కచ్చితంగా నా కోసం ఎదురుచూస్తుంది. నా ఫోటోను టీవీలో వేస్తే తప్పక వస్తుంది."

-ఎమిలీ

వలసదారుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ఓ వార్తా సంస్థ.. అందరిలాగే ఎమిలీ ఫొటోను టీవీలో ప్రసారం చేసింది.

ఆరేళ్ల తర్వాత తన కూతుర్ని కలుసుకోవాలని రాసి ఉందో ఏమో తెలియదు. ఆ సాయంత్రమే ఎమిలీ తల్లి గ్లెండా వాల్డెజ్ టీవీ చూస్తోంది. అకస్మాత్తుగా ఎర్రటి దుస్తువుల్లో కనిపించిన చిన్నారి ఫొటో చూసింది. 9 ఏళ్ల ఆ చిన్నారి తన కూతురేనని గ్రహించింది. అధికారులకు, వలసదారుల శిబిరానికి ఫోన్లు చేయడం మొదలెట్టింది. ఎమిలీ.. ప్రభుత్వ శిబిరంలోనే ఉందని అధికారులు తెలిపారు.

వెంటనే గ్లెండా కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు తర్వాత 25 రోజులకు టెక్సాస్ ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన కూతుర్ని కలుసుకుంది గ్లెండా. మనసారా తన కూతుర్ని గుండెలకు హత్తుకుంది.

కుటుంబ కలహాలు

కుటుంబాన్ని భర్త సరిగా పట్టించుకోలేదని గ్లెండా చెప్పింది. అందుకే తాను ఎమిలీ భవిష్యత్తుకోసం తన తల్లి వద్ద కూతుర్ని వదిలి అమెరికాకు వచ్చానని తెలిపింది. అయితే ఆమెను విడిచి వచ్చాక కొద్దిరోజులకు తండ్రి వచ్చి తీసుకెళ్లాడని, ఆ తర్వాత వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని ఎమిలీ చెప్పింది. దీంతో తనను మెక్సికో సరిహద్దు వద్ద విడిచి వెళ్లాడని ఎమిలీ ఏడుస్తూ చెప్పుకొచ్చింది.

"నా కూతరు డిటెన్షన్ క్యాంప్​లో ఉందన్న విషయం నాకు తెలియదు. టీవీలో నా కూతురి ఫొటో చూసి షాకయ్యా. మళ్లీ నా కూతురు నా నుంచి వేరు కావొద్దని దేవున్ని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నా కూతురికి ఇవ్వని ప్రేమనంతా ఇప్పటినుంచి ఇస్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను."

-గ్లెండా వాల్డెజ్​

వలసల్లో ఎక్కువ మంది పిల్లలే..

మెక్సికో నుంచి అమెరికాలోకి ఒంటరిగా ప్రయాణించిన పిల్లల్లో ఎమెలీ ఒకరు. మార్చిలో దాదాపు 19,000, ఏప్రిల్‌లో 17,200 మంది అమెరికాకు వలసవచ్చారు. అందులో చాలామంది పిల్లలే ఉన్నారు.

సరిహద్దు వద్ద కనిపించే ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు హోండురాస్ నుంచీ.. ప్రతి ఇద్దరిలో ఒకరు గ్వాటెమాల నుంచి వస్తున్న వారే ఉన్నారు.

ఇదీ చదవండి: పెరిగిన వలసలు- మళ్లీ మెక్సికో సరిహద్దు మూసివేత

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.