జార్జి ఫ్లాయిడ్‌కు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకుండా ఉండాలంటే పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు ఆయన సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్. పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోందని అమెరికా కాంగ్రెస్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు జరిగిన మరునాడే కాంగ్రెస్ ఎదుట హాజరయ్యారు ఫిలోనిస్. తన సోదరునిలా మరొకరు మరణించకూడదనే సభలో సాక్ష్యమిస్తున్నట్లు చెప్పారు.
జార్జి ఫ్లాయిడ్ మరణం ప్రపంచాన్ని మార్చిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఫిలోనిస్ ఫ్లాయిడ్. ఆయనలా ఇకమీదట ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదన్నారు.
"నేను అనుభవిస్తున్న బాధతో చాలా అలసిపోయా. ఎలాంటి కారణం లేకుండా మరో నల్లజాతీయుడు చనిపోతున్నప్పుడు భరించలేకపోతున్నా. దీన్ని ఆపమని చెప్పేందుకే మీ ముందుకొచ్చా. ఇక నైనా మా బాధను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు జరిగింది చాలని చెప్పేందుకు ప్రజలు వీధుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ దేశానికి, ప్రపంచానికి అవసరమైన మార్గదర్శకులుగా ఉండండి. సరైన పని చేయండి "
-అమెరికా కాంగ్రెస్‌లో ఫిలోనిస్ ఫ్లాయిడ్
జార్జి ఫ్లాయిడ్ మరణం అనంతంరం పోలీసు వ్యవస్థలో సంస్కరణలు, జవాబుదారీతనంపై ప్రతిపాదిత మార్పులపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.