అమెరికాలో పోలీసు కర్కశత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌కి సంఘీభావంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వర్జీనియాలో భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి చేరి నిరసన వ్యక్తం చేశారు. ప్రఖ్యాత కాన్ఫడరేట్ స్టాట్యూ వద్ద ఆందోళన చేపట్టిన నిరసనకారులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.
లాస్ ఏంజిలిస్‌లో శాంతియుతంగా నిరసన చేపట్టారు ప్రజలు. నగరంలోని సిటీ హాల్ వరకు నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఓ దశలో నిరసనకారుల అభ్యర్థన మేరకు, వారికి మద్దతుగా శిలువ(రెడ్ క్రాస్) ముందు పోలీసులు మోకరిల్లారు. రివర్సైడ్ కౌంటీ అధికారి చాడ్ బియాన్కో సైతం మోకాళ్లపై నిల్చొని వారికి సంఘీభావం ప్రకటించారు. అమెరికన్ సినిమాకు కేంద్ర బిందువైన హాలీవుడ్ ప్రాంతంలోనూ నిరసనలు మిన్నంటాయి.
న్యూయార్క్ నగరంలో ప్రజలు శాంతియుత నిరసన బాట పట్టారు. వాషింగ్టన్‌లోని బెతెస్డా ప్రాంతంలో ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తూ నిరసనల్లో పాల్గొన్నారు.
2,700 మంది అరెస్టు
లాస్ ఏంజిలిస్‌లో ఇప్పటివరకు 2,700 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2,500 మందిని... లూటీలు, దోపిడీ, పోలీసులపై దాడి వంటి నేరాలకు పాల్పడిన మరో 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా వరకు నిరసనలు శాంతియుతంగానే జరుగుతున్నట్లు తెలిపారు.
ఫిర్యాదు
ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా మిన్నియాపొలిస్ రాష్ట్రం... ఆ రాష్ట్ర పోలీసు శాఖపై మానవ హక్కుల వ్యాజ్యం దాఖలు చేసింది. గత 10 ఏళ్లలో పోలీసులు వ్యవహరించిన విధానాలపై దర్యాప్తు చేయడం ద్వారా ప్రజల పట్ల వారు వివక్షతతో వ్యవహరించారో లేదో తెలుసుకోవచ్చని మిన్నియాపొలిస్ గవర్నర్ టిమ్ వాల్జ్ పేర్కొన్నారు. తద్వారా ఇలాంటి జాతి విద్వేషాలను అరికట్టవచ్చని అన్నారు. మానవ హక్కుల కమిషనర్ రెబెకా లూసెరో ఈ దర్యాప్తునకు అధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు. వివక్షను పూర్తిగా రూపుమాపడానికి స్వల్ప, దీర్ఘ కాల చర్యలను అమలు చేసేలా పోలీసుల నుంచి హామీ తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా
ఫ్లాయిడ్ మృతి అనంతరం అమెరికాలో ప్రారంభమైన ఆందోళనలు ప్రపంచంలోని నలుమూలలకు విస్తరిస్తున్నాయి. పోలీసు దుశ్చర్యతో పాటు జాత్యహంకారానికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు ప్రజలు.
ఫ్రాన్స్‌లో హింసాత్మకం
అమెరికా నిరసనకారులకు మద్దతుగా ఫ్రాన్స్‌లో ప్రజలు ఆందోళన నిర్వహించారు. 2016లో పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన ఓ నల్లజాతీయుడి మృతికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శించారు. పది మంది పాల్గొనే సమావేశాలపై పోలీసులు విధించిన నిషేధాన్ని నిరసనకారులు ధిక్కరించారు. దీంతో నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆస్తులకు నిప్పంటించారు ఆందోళనకారులు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై భాష్పవాయు గోళాలు ప్రయోగించారు.
ఇంగ్లండ్
ప్లాయిడ్ మృతికి సంతాపంగా ఇంగ్లండ్‌లోనూ ఆందోళనలు జరిగాయి. బౌర్నెమౌత్ పట్టణంలో వందలాది మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. మోకాళ్లపై నిల్చొని ఫ్లాయిడ్ మరణానికి సంఘీభావం ప్రకటించారు. అమెరికాలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు.
ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ టెలి అవివ్ ప్రాంతంలోని అమెరికా దౌత్య కార్యాలయం ఎదుట దాదాపు 200 మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. 'నల్లజాతీయుల ప్రాణాలూ ముఖ్యమే' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
నెదర్లాండ్
నెదర్లాండ్ రాజధాని హేగ్ నగరంలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. సామాజిక దూరం పాటిస్తూ శాంతియుత నిరసన చేపట్టారు. 'ఐ కాంట్ బ్రీత్'(నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను) అని రాసి ఉన్న ప్లకార్లులు చేతబట్టారు.