డెంగీ, యెల్లో ఫీవర్, గున్యాలతో పాటు జికా వైరస్‌ను కట్టడి చేసేందుకు అమెరికా పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేపట్టారు. జన్యుమార్పిడి దోమలను సృష్టించి, వాటిని ప్రయోగాత్మకంగా జనంలోకి విడుదల చేశారు.
ఎడెస్ ఈజిప్టీ జాతి ఆడ దోమల కారణంగా ఏటా ఈ వ్యాధులు విజృంభించి అనేక మంది మృతి చెందుతున్నారు. ఈ దోమలను కట్టడి చేసేందుకు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సాంకేతిక సంస్థ 'ఆక్సిటెక్'తో కలిసి ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాజెక్టు చేపట్టింది.
ఆడ దోమల పనిపట్టేందుకు
దీని ద్వారా జన్యుమార్పిడి చేసిన 'ఓఎక్స్5034' అనే దోమలను పరిశోధకులు సృష్టించారు. ఇవి కేవలం మగ దోమలు మాత్రమే. వ్యాధులకు కారణమయ్యే ఆడ దోమలు ప్రౌఢదశకు రాకముందే... పరిశోధకులు సృష్టించిన దోమలు ప్రత్యేకమైన జన్యువులను వాటికి చేరవేస్తాయి. దీంతో అవి చనిపోతాయి. ఈ ఓఎక్స్5034 దోమలు ఆడ దోమలను కలుస్తూ వాటి మరణానికి కారణమవుతాయి. పర్యావరణ అనుమతులు రావడంతో ఈనెల 1న ఆరు పెట్టెల్లోని దోమలను పరిశోధకులు ప్రయోగాత్మకంగా విడుదల చేశారు. మిణుగురు పురుగుల మాదిరే ఈ దోమలు ఫ్లోరోసెంట్ వెలుగులు విరజిమ్ముతాయని...దీంతో వాటిని గుర్తించడం సులభమవుతుందని వారు వివరించారు.
ఇప్పటికే బ్రెజిల్, పనామా, మలేసియా, కేమన్ ఐలాండ్స్‌లో ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. 90% మేర విజయవంతం అయ్యాయి. ఓఎక్స్5034 దోమలతో మనిషికి ఎలాంటి హానీ ఉండదని పరిశోధకులు చెబుతున్నా... కొత్త జీవుల సృష్టితో సమాజాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 500 రాకెట్లను తట్టుకొన్న ఉక్కుగొడుగు అది..!