కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ-7 నిర్ణయించింది. వైరస్ వ్యాప్తితో నిలిచిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు ఈ దేశాధినేతలు.
కరోనా వైరస్‌పై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా సమావేశమైన జీ-7 దేశాల నాయకులు.. సంయుక్త ప్రకటన చేశారు.
"కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. జీ-7 దేశాల వృద్ధి బలోపేతమే లక్ష్యంగా ఆర్థిక మందగమనం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటాం. సంస్థలు, కార్మికులు, మహమ్మారి కారణంగా నెమ్మదించిన రంగాలకు తక్షణ సహకారం అందిస్తాం."
- జీ-7 దేశాధినేతల ప్రకటన
ఈ సమావేశంలో తమ తమ ఆర్థిక మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు నేతలు. ప్రతివారం సమీక్ష చేపట్టి అవసరమైన విధానాలను అమలు చేయాలని నిర్దేశించారు. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. సరఫరా, రవాణా వ్యవస్థ మెరుగుపడేందుకు కృషి చేయాలని సూచించారు.
కరోనా ప్రభావిత దేశాలకు అంతర్జాతీయ సంస్థలు సాయం అందించాలని జీ-7 నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. జీ-7 కూటమిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: 45 మందిపై అమెరికా 'కరోనా వ్యాక్సిన్' పరీక్షలు