కరోనా విజృంభణతో అమెరికా అల్లాడుతోంది. ఆదివారం కేసుల సంఖ్య 24,390గా నమోదైనప్పటికీ.. ఫిబ్రవరితో పోలిస్తే రోజువారీ సగటు మాత్రం గణనీయంగానే ఉంది. ప్రధాన ఆస్పత్రులన్నీ కొవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి. కొంతమందికి సాధారణ చికిత్స అందడం కూడా గగనమైపోయిందని సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. డెల్టా వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
బాధితులకు ఎక్మో చికిత్స అవసరమవుతోందని, అయితే అనేక ఆస్పత్రులలో ఇందుకు అవసరమయ్యే పరికరాలు అందుబాటులో లేదని సీఎన్ఎన్ పేర్కొంది. అత్యంత ప్రమాదకరంగా వ్యాపిస్తున్న డెల్టాను కట్టడి చేయలేక రాష్ట్రాలు చతికిలపడ్డాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించింది.
- లూసియానాలో కరోనాతో ఆస్పత్రుల్లో చేరికలు గతవారం కొత్త గరిష్ఠాలకు చేరాయి.
- ఫ్లోరిడాలో 2020 జులై 23న గరిష్ఠ స్థాయి కేసులు నమోదు కాగా.. ఇటీవల అంతకు 13 శాతం అధికంగా బాధితులు ఆస్పత్రుల్లో చేరారు.
- జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో సగటున లక్ష కేసులు వస్తున్నాయి. గత ఆరు నెలల్లో ఇదే అత్యధికం
- మరణిస్తున్నవారిలో వ్యాక్సిన్ తీసుకోనివారే అధికంగా ఉన్నట్లు సీడీసీ నిపుణులు తెలిపారు. డెల్టా వేరియంట్ బారినపడ్డవారు కనీసం 8-9 మందికి వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పారు.
ఫ్లోరిడా, ఫోర్ట్ లాండర్డేల్లోని విలాసవంతమైన నైట్‌క్లబ్‌లలో ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. యువత అత్యధికంగా ఈ ప్రాంతాలకు వస్తున్న నేపథ్యంలో.. ఇక్కడే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇరాన్ విలవిల
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగానూ కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది. ఇరాన్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. కొత్తగా 39,619 కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత అత్యధిక ఒకరోజు కేసులు ఇవే. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వ్యాప్తితో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమైనీ. ఇప్పటికే అమెరికా ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రపంచదేశాల్లో పరిస్థితి ఇలా
దేశం | కొత్త కేసులు | మొత్తం కేసులు |
ఇరాన్ | 39,619 | 41,58,729 |
బ్రిటన్ | 27,429 | 60,69,362 |
ఇండోనేసియా | 26,415 | 36,66,031 |
అమెరికా | 24,390 | 3,65,43,338 |
బీజింగ్‌కు రాకపోకల నిలిపివేత
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్ ముప్పు మధ్యస్థంగా లేదా తీవ్రంగా ఉన్న ప్రావిన్సుల నుంచి రాజధాని బీజింగ్‌కు రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది చైనా. ఆయా ప్రాంతాల నుంచి రాజధానికి రైలు, విమాన టికెట్ల కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఒకవేళ ఇతర వాహనాల్లో ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నించినా వారిని వెనక్కి పంపించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
ఈమేరకు మధ్యస్థ, తీవ్ర ముప్పు ఉన్న ప్రాంతాల వారికి ప్రత్యేకంగా పసుపు రంగుతో కూడిన హెల్త్ కోడ్‌లు ఇస్తారు. వైరస్ వ్యాప్తి తగ్గితే అప్పుడు కోడ్ మారుస్తారు. ఆ ప్రాంతాల్లో ముప్పు తగ్గి ఆకుపచ్చ కోడ్ ఇచ్చేంతవరకు రాజధానికి రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుంది. కోడ్ మారిన తర్వాత స్థానికులకు లేదా ఆయా ప్రాంతాలకు 14 రోజులుగా వెళ్లనివారికి మాత్రమే బీజింగ్‌కు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆకుపచ్చ కోడ్‌కు మారిన తర్వాత కూడా అక్కడి ప్రజలు 48 గంటల్లో చేయించుకున్న న్యూక్లియక్ యాసిడ్ టెస్ట్ ‘నెగెటివ్’ ఫలితాన్ని చూపించాల్సి ఉంటుంది.
చైనాలో కరోనా వైరస్ తొలిసారి బయటపడిన వుహాన్‌తో పాటు నాన్‌జింగ్, యాంగ్‌ఝౌ, ఝాంగ్‌జియాజీ, వెన్‌వూ వంటి 15 నగరాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. వీటి నుంచి రాకపోకలను నిలిపివేశారు. చైనాలోని జియాంగ్‌సు, హెనన్, యున్నన్, హుబేయ్, హునన్ సహా పలు ప్రావిన్సుల్లో శనివారం 150 కేసులు బయటపడ్డాయి.
ఇదీ చదవండి: