అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ అమెరికన్లు నిర్వహించిన ర్యాలీలు చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా కొంతమంది భారతీయ అమెరికన్లు... డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌కు మద్దతుగా మరి కొంతమంది భారతీయ అమెరికన్లు వేర్వేరుగా ప్రచార ర్యాలీలు చేపట్టారు.
ట్రంప్ మద్దతుదారులు
భారత్‌కు అత్యంత సన్నిహితుడైన అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ మొదటి వారని.. భారత్-అమెరికా మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి కృషి చేసిన ట్రంప్‌నకు ఓటు వేయాలని ప్రచారం చేశారు ట్రంప్ మద్దతుదారులు. మంచి ఆర్థిక వ్యవస్థ, తక్కువ పన్నులు, మంచి ప్రభుత్వం కావాలా? అయితే ట్రంప్‌ను ఎన్నుకుందామని ర్యాలీలో పేర్కొన్నారు. 'భారతీయ అమెరికన్లు సంఖ్యలో తక్కువ కావచ్చు. కానీ సంపాదనలో శక్తిమంతంగా ఉన్నాం. అందుకే అందరు ఏకమై ట్రంప్‌ను ఎన్నుకుందాం' అని ప్రచారం చేశారు.
బైడెన్ మద్దతుదారులు
భవిష్యత్తు తరాలవారి కలలను సాకారం చేసుకోవాలంటే జో బైడెన్‌ను దేశ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యరీస్ను ఎన్నుకోవాలని మరికొంతమంది భారతీయ అమెరికన్లు గెట్ ఔట్ ది ఓట్ (జీఓటీవీ) పేరుతో కాలిఫోర్నియాలో ప్రచార ర్యాలీ చేపట్టారు. 'హ్యారీస్ ఎన్నికల్లో గెలుపొందితే... దేశ చరిత్రలో తొలి మహిళ ఉపాధ్యక్షురాలు అవుతారని... ఇది మనందరికి గర్వకారణం' అంటూ ప్రచారం చేశారు.
ఇదీ చూడండి: అమెరికా ఎన్నికల్లో 'ఏపీ ఓట్‌కాస్ట్ ' అంచనాలు నిజమయ్యేనా?