'దయచేసి మంచి దుస్తులు వేసుకోండి. మంచం దిగి మాట్లాడండి...' ఇవి ఓ స్నేహితుడు మరో మిత్రుడితో అంటున్న మాటలు కావు. ఓ జడ్జి.. తన న్యాయవాదులకు చేసిన విజ్ఞప్తి. ఈ విచిత్ర అనుభవం అమెరికాలోని ఓ ఫ్లోరిడా కోర్టు జడ్జికి ఎదురైంది.
'జూమ్' ద్వారా విచారణ
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది బ్రోవార్డ్ కౌంటీ న్యాయవ్యవస్థ. మార్చి 16 నుంచి 'జూమ్' ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విచారణ చేపడుతోంది. ఇప్పటివరకు 1,200 కుపైగా సమావేశాలు జరిగాయి. 14,000మందికిపైగా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో కొందరు న్యాయవాదులు విచిత్రంగా దర్శనమిస్తున్నారు. వాటిపై న్యాయమూర్తి డెన్నిస్ బెయిలీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెస్టన్ బార్ అసోసియేషన్‌కు లేఖ రాశారని ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
కనీసం చొక్కా లేకుండా..
"కెమెరా ముందుకు న్యాయవాదులు వస్తున్న తీరు చర్చించాల్సిన విషయం. ఒక న్యాయవాది షర్టు లేకుండా కనిపిస్తున్నారు. మరో మహిళా న్యాయవాది మంచం మీద.. దుప్పటి కప్పుకునే దర్శనమిస్తున్నారు."
- డెన్నిస్ బెయిలీ, న్యాయమూర్తి
వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ చేపట్టడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు జడ్జి. న్యాయవాదులు స్క్రీన్లను చూడకుండా.. తమ పుస్తకాలను చూస్తున్నారని తెలిపారు. దీని వల్ల విచారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతోందన్నారు.
ఇదీ చదవండి: ఆ పెద్దాయన నడిచినందుకే 15 లక్షల పౌండ్ల విరాళం