అమెరికా ప్రజలంతా కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు ఆ దేశ ప్రథమ మహిళ, డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్. వీధుల్లో రద్దీగా ఉండవద్దని, తమ కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో సమయం గడపాలని సూచించారు. అమెరికాలో హింసాత్మక ఆందోళనలకు తావు లేదని, శాంతియుత నిరసనలను ప్రజలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో ఆమె ట్వీట్ చేశారు మెలానియా.
" అన్ని నగరాలు, అన్ని వర్గాల ప్రజలు సురక్షితంగా ఉండటానికి అర్హులు. అందరం ఒక్క తాటి పైకి వస్తేనే శాంతి నెలకొల్పడం సాధ్యమవుతుంది. నిరసనల్లో హింసకు పాల్పడవద్దు "
-మెలానియా ట్రంప్ ట్వీట్
జార్జి ఫ్లాయిడ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు మెలానియా.
వైఫల్యాలను పరిశీలించాలి..
సమన్యాయం కోసం సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ బుష్. విషాద వైఫల్యాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, నల్లజాతీయులకు జరుగుతున్న అన్యాయంపై తాను, తన భార్య లౌరా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. శాంతియుత నిరసనలే దేశానికి ప్రయోజనకరమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. జాతి వివక్ష కారణంగా ఆఫ్రికన్ అమెరికన్లు సొంత దేశంలోనే దాడులకు, భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బుష్.
సమాజంలో నెలకొన్న జాతి వివక్షకు ఎలా ముంగిపు పలకాలనే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరముందన్నారు బుష్. ఇలాంటి ఘటనలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయన్నారు.