కొవిడ్-19 బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాక మొదటి పది రోజుల్లో ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఫలితంగా ఆసుపత్రిలో తిరిగి చేరడానికి, మరణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనాతో సంబంధం లేని నిమోనియో, గుండె వైఫల్యం సమస్యలతో అదే ఆసుపత్రిలో చేరిన ఇతర రోగులతో పరిశోధకులు పోల్చి చూశారు. కొవిడ్ బాధితులు డిశ్ఛార్జి అయ్యాక తిరిగి ఆసుపత్రి పాలుకావడానికి లేదా మరణించడానికి ఆస్కారం 40-60శాతం ఉన్నట్లు గుర్తించారు. అయితే 60 రోజుల తరువాత మాత్రం గుండె వైఫల్యం, నిమోనియా బాధితులతో పోలిస్తే కరోనా బాధితులకు ఈ రెండు రకాల ముప్పులు బాగా తక్కువగా ఉన్నట్లు తేల్చారు.
మొదటి రెండు నెలల్లో కొవిడ్ బాధితుల్లో 9 శాతం మంది మరణించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆరోగ్యం మళ్లీ క్షీణించడం వల్ల 20శాతం మంది తిరిగి ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. ఆసుపత్రిల్లో ఉండగానే 18.5 శాతం మంది చనిపోయారని వివరించారు. మొత్తంమీద.. తీవ్రస్థాయిలో అనారోగ్యంపాలైన కొవిడ్ బాధితులు మొదటి రెండు వారాల్లో సాధారణం కన్నా ఎక్కువ ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించారు.