కొవిడ్-19ను ఎదుర్కొనే రోగ నిరోధకశక్తిని పెంపొందించేందుకు మరో ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్-ఎఫ్‌డీఏ) అత్యవసర ఆమోదం పలికింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడినప్పుడు ఇదే ఔషధాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించడం గమనార్హం.
రీజనరాన్ ఫార్మాసూటికల్స్ సంస్థ ఈ డ్రగ్‌ను తయారు చేసింది. ఈ డ్రగ్‌ను స్వల్పం నుంచి ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి వినియోగించవచ్చని ఎఫ్‌డీఏ తెలిపింది. ఆసుపత్రి పాలు కాకుండా వైరస్ ముదరకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఎవరికి.. ఎలా?
- ఇంట్రావీనస్ (ఐవీ) విధానంలో ఈ డ్రగ్‌ను ఇస్తారు.
- 12 ఏళ్లు పైబడిన వయసువారికి మాత్రమే ఈ ఔషధం వినియోగం.
- కనీసం 40 కిలోల కన్నా ఎక్కువ బరువున్న రోగులకు ఇవ్వాలి.
- ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉండి కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి కూడా ఈ మందు ఇవ్వొచ్చు.
- అయితే ఈ డ్రగ్‌పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాథమిక అధ్యయనంలో మాత్రం ఈ ఔషధం కరోనాను కొంతమేరకు అరికట్టగలదని తేలింది.
- 3 లక్షల మంది రోగులకు తొలి డోసులు ఇచ్చేందుకు రీజనరాన్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
అత్యవసర ఆమోదం ఎందుకు?
ప్రస్తుతం అమెరికా కరోనా రెండో వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రయోగాత్మక కరోనా ఔషధాలను ప్రోత్సహించాలని ఎఫ్‌డీఏ నిర్ణయించింది. సాధారణ పరిస్థితిల్లో ఏదైనా ఔషధానికి ఎఫ్‌డీఏ ఆమోదం లభించాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది.