అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది ఫేస్బుక్. ఎన్నికలకు వారం ముందే రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.
"ఈ ఎన్నికలను యథావిధిగా వ్యాపారంలాగా భావించట్లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజలు పేరు నమోదు చేసుకోవడం, ఓటు వేయడానికి సహాయపడటమే కాకుండా ఎన్నికల ఫలితాలపై గందరగోళం తొలగించి.. హింస, అశాంతిని తగ్గించడానికి సంస్థ చర్యలు తీసుకుంటుంది"
-- మార్క్ జుకెర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
కొవిడ్-19, ఓటింగ్ అంశాలపై చేసే తప్పుడు వార్తలనూ తొలగిస్తామని పేర్కొంది ఫేస్బుక్. అభ్యర్థుల చేసే పోస్ట్‌లకు, ముందస్తుగా సంస్థలు విడుదల చేసే పోల్స్‌కు.. అధికారిక ఫలితాల లింకులను జత చేస్తామని తెలిపింది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు సంబంధించి నకిలీ సమాచారం వ్యాప్తి సహా అమెరికన్లను తప్పుదోవ పట్టిస్తూ.. సమాజంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వందలాది నెటవర్క్లను తొలగించినట్లు సంస్థ తెలిపింది.
అయితే కొంతమంది నిపుణులు ఈ కొత్త విధానాలను ప్రశంసించినా.. వాటి అమలు సంస్థకు ఓ సవాల్ అని అభిప్రాయపడ్డారు.
"అమెరికాలో ఎన్నికలు దాదాపు రెండు నెలల ముందే ప్రారంభమవుతాయి. ఉత్తర కరోలినా నుంచి ఓటింగ్ మొదలైతే.. రోజు తప్పించి రోజు ఒక్కో రాష్ట్రంలో ఓటింగ్ జరుగుతుంది. అంటే ఫేస్బుక్ యాడ్లపై ప్రజలు రెండు నెలలు నమ్మకం లేకుండా ఉండాలా?" అని ఆల్ట్రావైలెట్ మహిళా సంఘం నేత షన్నా థామస్ ప్రశ్నించారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈసారైనా వాటిని అడ్డుకోవాలని ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ సహా ఇతర సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.