భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు కరవుతో కొట్టుమిట్టాడుతున్నారు. తాగడానికి ఒక్క చుక్క నీరు లేక విలవిలలాడుతున్నారు. అమెరికా కాలిఫోర్నియాలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి(california drought 2021). గడ్డు కాలం నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తున్న నగరవాసులను ఓ కొత్త సాంకేతికత పలకరించింది. గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు(water from air machine).
సునామీ ప్రోడక్ట్స్ అనే సంస్థ ఈ యంత్రాన్ని రూపొందించింది. ఇది ఒక ఏసీలానే పనిచేస్తుంది. కాయిల్స్‌ను ఉపయోగించుకుని చల్లటి గాలిని నీటిగా మారుస్తుంది. యంత్రానికి అమర్చిన బేసిన్ ద్వారా నీరు శుద్ధి అవుతుంది.
"గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేయడమనేది మ్యాజిక్ కాదు. అది సైన్స్. ఈ యంత్రాలతో దానిని నిజం చేసి చూపిస్తున్నాం. గాలిని డీహ్యూమిడిఫై చేస్తాము. అలా తాగడానికి నీరు ఉత్పత్తి అవుతుంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉపయోగించేలా, సైనిక అవసరాలు తీర్చేలా ఈ యంత్రాన్ని రూపొందించాలని అనుకున్నాము. చాలా కరెంట్ అవసరం అవుతుంది. ఖర్చు గురించి పట్టించుకోలేదు. తాగడానికి నీరు వస్తే చాలనుకున్నాము. ఆ తర్వాత మాకు ఒక విషయం అర్థమైంది. మంచి నీరు అవసరం ఉన్నా, ఆ అవసరం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. అందువల్ల పరిశోధనను ఆపేశాము. భారీ మొత్తంలో నీటిని ఉత్పత్తి చేయాలన్న ఆలోచనను విరమించుకుని, తక్కువే అయినా, సమర్థవంతమైన, అవసరానికి సరిపడా వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాము."
--- టెడ్ బౌమన్, డిజైన్ ఇంజినీర్.
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ యంత్రం బాగా పనిచేస్తుంది. తమ ఇళ్లకు యంత్రాన్ని అమర్చుకున్న స్థానికులు తెగ సంబరపడిపోతున్నారు. గార్డెన్‌కు సరిపడా నీరు వస్తే చాలనుకున్నామని, కానీ అన్ని అవసరాలను తీర్చేస్థాయిలో నీరు ఉత్పత్తి అవుతోందని డాన్ జాన్సన్ అనే వ్యక్తి వివరించారు. యంత్రాలు పనిచేయడం కోసం తన ఇంటి మీద సోలార్ ప్యానెళ్లు అమర్చుకున్నారు జాన్సన్.
అయితే ఈ యంత్రం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీని ధర సుమారు 22లక్షల రూపాయలు. దీనిని ఇళ్లల్లో వాడుకోవచ్చని, పరిశ్రమలు, నగరమంతా ఉపయోగించడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాతావరణ మార్పులపై యుద్ధం చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తే.. కరవు తగ్గుతుందని, ఇలాంటి యంత్రాల అవసరం ఉండదని అంటున్నారు.
ఇవీ చూడండి:-