ట్రంప్ అంతే.. కింద పడ్డా.. పైచేయి నాదే అంటారు. ప్రపంచమంతా ఓ కోణంలో చూసే దానిని ట్రంప్ మాత్రమే వేరే కోణంలో చూస్తారు. తాజాగా ఇలాంటి మాటల విన్యాసాన్ని మరోసారి ప్రదర్శించారు.
ఆఫ్రో-అమెరికన్లపై దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం శ్వేతసౌధం ఎదుట భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రహస్య బంకర్‌లోకి తరలించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ట్రంప్ తన ధైర్యంపై మచ్చగా దానిని భావించారు. తాజాగా దానికి సంబంధించి మాట్లాడుతూ.. "నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండుమూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. బయట ఏమేం రాశారో కూడా చదివాను. అక్కడకు వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అయినా, నా సమీపంలోకి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు" అని ఫాక్స్ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
గంటసేపు బంకర్లోనే అంటూ వార్తలు..
ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్(పీఈఓసీ)గా పిలిచే ఈ బంకర్‌లోకి శుక్రవారం రాత్రి అధ్యక్షుడు వెళ్లినట్లు తొలుత న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. ఆయన అక్కడ గంటసేపు ఉన్నట్లు పేర్కొంది. అసలు అమెరికా అధ్యక్షుడిని రక్షించడానికి సైన్యం, రహస్య ఏజెన్సీలు పలు ఏర్పాట్లు చేశాయి. దాడికి ఆస్కారం ఉన్నట్లు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించేస్తారు. ముఖ్యంగా కోల్డ్‌వార్ సమయంలో అధ్యక్షుడిని రక్షించేందుకు ఓ చిన్నసైజు విమాన వాహక నౌకను కూడా సిద్ధం చేశారు. కానీ, తర్వాత ఆ ప్రణాళికను వదిలేశారు. ఇప్పటికీ భారీ దాడులను నుంచి అమెరికా అధ్యక్షుడి రక్షణకు చాలా ఏర్పాట్లు ఉన్నాయి. వీటిపై అమెరికాలోని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.