అమెరికాలో వర్షాకాలం తదనంతరం వచ్చే శీతాకాలంలో వైరస్ వ్యాప్తి ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ చీఫ్ స్కాట్ గాట్లిబ్ అంచనా వేశారు. ఈ ఏడాది వ్యాక్సిన్ విస్త్రృత స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ సంవత్సరాంతానికి దేశ జనాభాలో 20శాతం మంది అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ మహమ్మారి బారిన పడతారని చెప్పారు. సీబీఎస్ అనే ప్రముఖ వార్తా ఛానెల్ నిర్వహించే 'ఫేస్ ద నేషన్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్, భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తి పోయారని గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. ఇది సవాల్‌గా మారే అవకాశం ఉందన్నారు. వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఈ తరుణంలో ప్రజల ఆలోచనా ధోరణి మారడం ప్రమాదకరమని హెచ్చరించారు. రానున్న శీతాకాలంలో ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ మరింత దగ్గరగా మెలిగే అవకాశం ఉందన్నారు. ఇది వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత ప్రమాదకరమైన దశలోకి ప్రవేశిస్తున్నామని హెచ్చరించారు. పూర్తిస్థాయి శాస్త్రీయ విధానంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కంపెనీలు, అధికారులు టీకాను ముందస్తుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని తాను అనుకోవడం లేదని గాట్లిబ్ అభిప్రాయపడ్డారు. వైరస్ సోకే ముప్పు తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.