కరోనా వ్యాప్తిలో వాతావరణ ప్రభావం పెద్దగా లేదని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అది చాలా వరకూ వ్యక్తుల వ్యవహారశైలి కారణంగా విస్తరిస్తోందని వెల్లడైంది. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన దేవ్ నియోగి కూడా ఉన్నారు.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. వాస్తవంలో అలాంటిదేమీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో వాతావరణానికి, కొవిడ్-19కు మధ్య సంబంధం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తిలోకి ఈ వైరస్ నేరుగా వ్యాప్తి చెందే క్రమంలో వాతవరణ ప్రభావం పెద్దగా లేదని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్ధరించారు.
ప్రజలు బయట తిరగడం వల్లే..
ప్రజలు బయట విపరీతంగా తిరగడం, ఇంటికి దూరంగా చాలా సేపు గడపడం వంటి కారణాలే వైరస్ ఉద్ధృతికి ఎక్కువగా కారణమవుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి జులై వరకూ అమెరికాతోపాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీరుతెన్నులపై విశ్లేషణ జరిపిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధరణకు వచ్చారు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, మానవ వ్యవహారశైలికి మధ్య సంబంధాలపై వారు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా ప్రజల సెల్ఫోన్ డేటా ఆధారంగా వారి ప్రయాణ అలవాట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా సాంద్రత కూడా వైరస్ వ్యాప్తిలో ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు.
"కరోనా ఉద్ధృతికి వాతావరణమే కారణమన్న భావనను మనం వీడాలి. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తికి కారణవుతున్న అంశాల గురించి తెలుసుకోవాలి".
-సాజిద్, శాస్త్రవేత్త.