ఎనిమిది మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ గొరిల్లాకు కడుపుకోత మిగిలింది. అమెరికా న్యూ ఒర్లాన్స్‌లోని ఓ జూలో టుమానీ అనే గొరిల్లా శుక్రవారం ఓ బుజ్జి గొరిల్లాకు జన్మనిచ్చింది. బిడ్డను అక్కున చేర్చుకొని ముద్దాడింది. ఎంతో మురిపెంగా తన ప్రతిరూపాన్ని కౌగిలించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టాయి. కానీ, వారం తిరక్కుండానే ఆ ఆనందాలు ఆవిరయ్యాయి. బుజ్జి గొరిల్లా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
ఆడుబాన్ జూలో గర్భం దాల్చిన టుమానీ కడుపున పురుడుపోసుకుంది బుజ్జి గొరిల్లా. పుట్టినప్పుడు ఆరోగ్యంగా కనిపించిన చిన్నారి గొరిల్లా తల్లికి దగ్గరవ్వడం చూసి, జూ సిబ్బంది సంతోషించారు. తల్లీ బిడ్డలను ఏకాంతంగానే ఉంచారు. అందుకే, పుట్టింది ఆడ గొరిల్లానా, మగ గొరిల్లానా కూడా చూడలేదు. చిన్నారి గొరిల్లాకి ఇంకా నామకరణం కూడా కాలేదు. కానీ, బుధవారం ఆకస్మాత్తుగా చిన్నారి గొరిల్లా చిన్నబోయింది. వెంటనే పశు వైద్యశాలకు తరలించారు సిబ్బంది. కానీ, ఫలితం లేకపోయింది.
అయితే, గొరిల్లా మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. టుమానీకి చనుబాల ఉత్పత్తి తక్కువ అవ్వడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు జూ అధికారులు. బుజ్జి గొరిల్లా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.
ఇవీ చదవండి: బుల్లి గొరిల్లాను తల్లి ఏం చేసిందో చూడండి!