మనుషుల అక్రమ రవాణా కారణంగా ఓ పసికందు సహా నలుగురు భారతీయులు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన అమెరికా-కెనడా సరిహద్దుల్లో జరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిచంగా వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. అమెరికా, కెనడాలోని భారత రాయబారులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై తక్షణం స్పందించాలని సూచించారు.
మృతుల్లో ఓ పసికందు సహా ఇద్దరు మైనర్లు ఉన్నట్లు మనిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. ఎమెర్సన్కు సమీపంలో అమెరికా- కెనడా సరిహద్దులో కెనడా వైపున నలుగురి మృతదేహాలకు గడ్డకట్టుకుపోయిన లభించినట్లు చెప్పారు.
" కెనడా-యూఎస్ సరిహద్దులో ఓ పసికందు సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికా, కెనడాలోని మన రాయబారులు వెంటనే స్పందించాలని సూచించాం. "
- జైశంకర్, విదేశాంగ మంత్రి.
అమెరికా రాయబారి తరణ్‌జిత్ సంధు, కెనడాలోని ఇండియన్ హైకమిషనర్ అజయ్ బిసారియాతో జైశంకర్ మాట్లాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఓ వ్యక్తి అరెస్ట్..
మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఈ ఘటనకు సంబంధం ఉన్న 47 ఏళ్ల స్టీవ్ శాండ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మిన్నెసోటా జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. భారత్‌కు చెందిన ఇద్దరితో కలిసి ఓ కారులో వస్తుండగా శాండ్‌ను పట్టుకున్నట్లు తెలిపింది. వాహనంలో ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లలో నీరు, పళ్ల రసం, స్నాక్స్ ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురిని బోర్డర్ పెట్రోల్ స్టేషన్‌కు తరలించారు అధికారులు. ఐదుగురు భారతీయులు నడుచుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చూడండి: జైలుపై వైమానిక దాడి.. 100మంది ఖైదీలు మృతి