అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడినప్పుడు తాను ఆశ్చర్యపోలేదని ప్రముఖ అంటు వ్యాధుల శాస్త్ర నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. వైద్య నిబంధనలు ఉల్లంఘించడం, మాస్కులు ధరించని వ్యక్తుల మధ్య అధ్యక్షుడు తిరగడాన్ని బట్టి చూస్తే తనకెలాంటి ఆశ్చర్యం కలగలేదని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 26న శ్వేతసౌధంలోని రోస్గార్డెన్లో జరిగిన కార్యక్రమాన్ని ఫౌచీ ప్రస్తావించారు. కార్యక్రమంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని అన్నారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడి ఉన్న ప్రాంతంలో ఆయన(ట్రంప్)ను చూసినప్పుడు.. అనారోగ్యానికి గురవుతారని అనిపించింది. అక్కడ(కార్యక్రమంలో) మనుషుల మధ్య దూరం లేదు. ఏ ఒక్కరూ మాస్కులు ధరించలేదు. నేను టీవీలో చూసినప్పుడు.. ఈ కార్యక్రమం నుంచి ఎలాంటి మంచి విషయం బయటకు రాదని అనుకున్నా. తర్వాత ఇది సూపర్ స్ప్రెడర్ కార్యక్రమంగా మారింది."
-ఆంటోనీ ఫౌచీ, జాతీయ అలర్జీ, అంటు వ్యాధుల సంస్థ డైరెక్టర్
ట్రంప్ మాస్కులు ధరించకపోవడంపైనా ఫౌచీ చురకలంటించారు. 'మాస్కు ధరించడాన్ని బలహీనతగా ట్రంప్ ఎందుకు పరిగణిస్తారో నాకు అర్థం కాదు' అని అన్నారు. వైరస్ నియంత్రణకు మాస్కులు చాలా ఉపయోగపడతాయని స్పష్టం చేశారు.
'సూపర్ స్ప్రెడర్ ఈవెంట్'
రోస్గార్డెన్లో జరిగిన కార్యక్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరును ట్రంప్ ప్రకటించారు. ఇక్కడికి వచ్చిన వారిలో 12 మందికి కొవిడ్ సోకింది. కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశంలోనే నిర్వహించారు. చాలా మందికి ముందస్తుగానే పరీక్షలు నిర్వహించారు. అయితే ఎక్కువ మంది మాస్కులు ధరించకపోవడం, కౌగిలింతలు, కరచాలనాలతో పలకరించుకోవడం, దగ్గరగా కూర్చోవడం వల్ల వైరస్ వ్యాప్తి జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 'సూపర్ స్ప్రెడర్ ఈవెంట్' అని గతంలో కూడా అభివర్ణించారు ఫౌచీ.
ఇదీ చదవండి- మాస్క్లు ధరించే వారికే కరోనా: ట్రంప్