కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో అనాథల్లా తల్లడిల్లుతున్న వారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి అమెరికాలోని వైద్యులు కొందరు మానవతను చాటుతున్నారు. పెద్ద వయసు రోగులకు తాము ఒంటరిమనే బాధ కలగనీయకుండా ‘మిషన్ ఐ-ప్యాడ్ సేకరణ’ ఉద్యమం ప్రారంభించారు. ప్రజల నుంచి ఐ-ప్యాడ్‌లు, ఫోన్లనూ సురక్షిత విధానాల్లో సేకరిస్తున్నారు. శానిటైజ్ చేసిన తర్వాత వాటిని రోగులకు అందిస్తున్నారు. వీటితో బాధితులు వీడియో కాల్ చేసుకుంటూ సాంత్వన పొందుతున్నారు.
బోస్టన్‌లో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం 20 రాష్ట్రాలకు విస్తరించింది. వైద్యుల చొరవతో కొందరు రోగులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, ధైర్యం తెచ్చుకుంటూ కొవిడ్‌ను జయిస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలో వైద్యులను మనసారా దీవిస్తున్నారు.