యాంటీ మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వైద్యులు.. కరోనా రోగులకు సూచించొచ్చని అమెరికా హెల్త్ సెక్రటరీ అలెక్స్ అజర్ స్పష్టం చేశారు. ఈ ఔషధాల వినియోగానికి అత్యవసరంగా ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) తెలిపిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది.
"ప్రస్తుతం అమెరికాలో హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ ప్రభుత్వం గుర్తించిన ఔషధాలే. వైద్యుల సూచన మేరకు వాటిని ఇంట్లో, ఆసుపత్రుల్లో వాడొచ్చు. తాజా ఎఫ్‌డీఏ నిర్ణయంతో చాలా మంది దాన్ని కేవలం ఆసుపత్రుల్లో వైద్యుల సమక్షంలోనే వాడాలేమో అని భావిస్తున్నారు. ఆ అపోహను మేం తొలగించాలనుకుంటున్నాం. దీన్ని వైద్యులు ఇతర చికిత్సలకు సూచించవచ్చు. ఎఫ్‌డీఏ నిర్ణయం వాటికి అడ్డు కాదు."
-అలెక్స్ అజర్, అమెరికా హెల్త్ సెక్రటరీ
కరోనా వైరస్‌పై చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్, క్లోరోక్విన్ సమర్థంగా పనిచేసే అవకాశం లేని కారణంగా అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఎఫ్‌డీఏ ప్రకటించింది. వీటివల్ల కలిగే ప్రయోజనాల కన్నా ముప్పే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దశాబ్దాల నాటి ఈ ఔషధాలను ప్రధానంగా మలేరియా చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
అమెరికా ఏజెన్సీలే విఫలమవుతున్నాయ్..!
ఎఫ్‌డీఏ తాజా నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం అమెరికా ఏజెన్సీలు మాత్రమే హెచ్‌సీక్యూ ప్రయోజనాల్ని గుర్తించలేకపోతున్నాయని విమర్శించారు. ఇతర దేశాల్లో కరోనాపై హెచ్‌సీక్యూ సమర్థంగా పనిచేస్తున్నట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు.
ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ తయారీలో వేగంగా ముందుకెళుతున్నాం'