కొవిడ్ రెండో దశ గ్రామీణ భారతదేశాన్ని కకావికలం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినూత్న కార్యచరణతో ముందుకొచ్చారు ప్రవాస భారత వైద్యులు, నిపుణులు. పల్లెల్లో కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి 'ప్రాజెక్ట్ మదద్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా కరోనా రోగులకు చికిత్స, ఆస్పత్రుల్లో పడకల లభ్యతపై రియల్ టైమ్ (ఆ సమయానికి)లో వివరాలు, టీకాపై దుష్ప్రచారాలను అరికట్టడంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు వర్చువల్‌గా సమాచారాన్ని అందిస్తున్నారు.
కట్టడిలో వారే కీలకం..
పల్లెల్లో వైరస్ నియంత్రణలో ఆరోగ్య కార్తకర్తలు, ఆర్ఎంపీలే కీలకమని భావించి.. వారికి సరైన అవగాహన, శిక్షణ అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. కరోనా లక్షణాలను గుర్తించడం, తేలికపాటి కేసులకు ఇంటివద్దే చికిత్స అందించడం, టీకాపై సలహాలు, ఓవర్ మెడికేషన్ ప్రమాదాలు, ఇతర ఉత్తమ పద్ధతులను రోగులకు వివరించడంలో వారికి మదద్ వైద్య బృందం తోడ్పడుతుంది.
"కరోనా సంక్షోభం తొలినాళ్లలో గ్రామీణ భారత్‌ను పట్టించుకోవడం లేదని గుర్తించాం. ఉదాహరణకు తెలంగాణలోని కరీంనగర్లో సుమారు 80 శాతం కేసులు.. పల్లె ప్రాంతాల నుంచే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది."
- రాజా కార్తికేయ, ప్రాజెక్ట్ సారథి
ఆర్ఎంపీల కేంద్రంగా..
స్థానిక పరిస్థితులు, ప్రజల ఆరోగ్యంపై ఆర్ఎంపీలకు సరైన అవగాహన ఉంటుందనే భావనతో వారి కేంద్రంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దారు. టీకాల సేకరణ, ప్రజలకు మాస్కులు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల సరఫరాపై ఆర్ఎంపీలకు స్థానిక భాషల్లో సమాచారం అందించడానికి మదద్ కృషిచేస్తోంది. వారితో వారానికి రెండుసార్లు అన్ని రకాల వైద్య స్పెషలిస్టులు జూమ్‌లో సమావేశమై చికిత్సలో అనుమానాలను నివృత్తిచేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకూ..
'మదద్ బృందం' మొదట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లోని ఆర్ఎంపీలతో కలిసి పనిచేస్తోంది. ఇతర ప్రాంతాలకూ సేవలనూ విస్తరించాలని భావిస్తోంది.
మదద్‌లో 27 మంది సభ్యులున్నారు. దీని సేవలను ఉత్తరాఖండ్, నేపాల్‌లో కూడా కొనసాగించాలని ఇప్పటికే వినతులు అందాయి. "ఈ ప్రాజెక్టులో సర్పంచులు, కలెక్టర్లను కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం. ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వైద్యులను సంప్రదించేందుకు ఓ హాట్ లైన్ ఏర్పాటు చేయనున్నాం." అని కార్తికేయ తెలిపారు.
అనుభవాల నుంచి..
ఏడాది కాలంగా అమెరికాలో కరోనా చికిత్సలో చేసిన పొరపాట్లు, నేర్చుకున్న పాఠాలను ఇక్కడి ఆరోగ్య కార్యకర్తలతో పంచుకోవాలనుకుంటున్నట్లు మినియాపొలిస్‌లో ప్రముఖ రేడియాలజీ స్పెషలిస్టు డా. సుబ్బారావు ఐనంపూడి తెలిపారు.
"ప్రజల్లో భయాందోళనలను పోగొట్టి, జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం ముఖ్యం. తేలికపాటి కేసులు తీవ్రంగా, ఆపై అతి తీవ్రంగా మారడాన్ని అరికట్టడంలో ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాం."
-డా. సుబ్బారావు ఐనంపూడి
బృందంలో తెలుగు వెలుగులు..
హైదరాబాద్‌లోని విద్యావేత్త దేవీ శోభ చంద్రమౌళి అవగాహన విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని కైవల్య గుండు.. నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. వైద్యుల బృందంలో డా. రాణి వట్టి, డా. సాయి లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి డా. హరిత రాచమల్లు ఉన్నారు.
"మదద్ ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. రోగులకు సహాయం చేయడంలో ఆర్ఎంపీల్లో విశ్వాసం పెరుగుతోంది."
-బలరామ్ రెడ్డి, ఇండియా ప్రాజెక్టు లీడ్
యాప్ కూడా..
ఆస్పత్రుల్లో పడకల లభ్యత, అక్కడికి చేరుకునే మార్గంపై రియల్ టైమ్ సమాచారం అందించడానికి వచ్చే వారం ఓ యాప్‌ను విడుదల చేయనున్నారు. దీనిని వాషింగ్టన్‌లోని డా. రాజేశ్ అనుమోలు రూపొందించారు.
"సిసలైన జ్ఞానం కింది స్థాయి వరకూ అందాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు ఆస్పత్రులకు వెళ్లాలా వద్దా అని సరైన నిర్ణయం తీసుకోగలరు. ఫలితంగా ఒత్తిడిలో ఉన్న ఆరోగ్య వ్యవస్థకు ఉపశమనం కలగడం సహా నిజంగా అవసరమైనవారికి ఆస్పత్రిలో పడకలు అందుబాటులో ఉంటాయి."
-డా. రేవతి తెప్పర్తి, మినియాపొలిస్
గ్రామాల్లో ఈ తరహా సేవలకు తమ మోడల్‌ను వినియోగించాలని ఇతరులను సూచిస్తున్నారు కార్తికేయ. ఆరోగ్య కార్యకర్తల కోసం అందరూ ఆలోచించాలని కోరారు.
ఇదీ చూడండి: కొవిడ్ బాధితులకు ఇలా సహాయం చేయండి!