అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై సెనేట్లో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. ఆయనపై బలమైన కేసు మోపాలని ప్రతిపక్ష డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. అభిశంసనపై వీరి తరఫున వాదనలు ప్రారంభించారు అడమ్ స్కిఫ్. డెమొక్రాట్ల ముఖ్యనేతగా ఉన్న ఈయనే ట్రంప్ అభిశంసనపై ప్రతినిధుల సభ న్యాయవిచారణ బృందానికి సారథ్యం వహించారు.
ఈ ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం చేసైనా మళ్లీ గెలవాలని ట్రంప్ యత్నిస్తున్నారని స్కిఫ్ ఆరోపించారు. ఇందుకోసం అధికారాన్ని ఉపయోగించి విదేశాల సాయం తీసుకుంటున్నారని వాదనలు వినిపించారు. తనపై అభిశంసనపై విచారణను జరగకుండా అడ్డుకునేందుకు కూడా ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్కిఫ్ సభకు తెలిపారు. చట్టానికంటే తాను ఎక్కువనే పోకడను ట్రంప్ అవలంబించారని పేర్కొన్నారు.
డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న జో బిడెన్‌పై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని వాదనల సందర్భంగా చెప్పారు స్కిఫ్. అధ్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో రష్యాతో వ్యూహాత్మక యుద్ధ భాగస్వామ్యం కోసం వందల మిలియన్ డాలర్ల మిలిటరీ సాయాన్ని నిలిపివేశారని ఆరోపించారు. ఈ ప్రవర్తన ట్రంప్ అభిశంసనకు కారణం కాకపోతే మరేదీ కాదని స్కిఫ్ అన్నారు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్నారు.
100మంది సభ్యులున్న సెనేట్లో ట్రంప్‌పై అభిశంసన నెగ్గాలంటే రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. రిపబ్లికన్లకు 53, డెమొక్రాట్లకు 47మంది సభ్యుల బలముంది. ట్రంప్‌పై అభిశంసనకు ఎగువ సభ ఆమోదం తెలపడం దాదాపు అసాధ్యం.
ఇదీ చూడండి: బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంటు ఆమోదం